Narendra Modi: మోదీని 120 సార్లు కాల్చిచంపినా తప్పులేదు!: సీపీఐ నేత నారాయణ

  • రేపు బంద్ లో పాల్గొనని వారు దేశద్రోహులే
  • మోదీ నిర్ణయం కారణంగా 120 మంది చనిపోయారు
  • బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్-టీడీపీతో కలుస్తాం

పెట్రోల్ ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతిపక్షాలు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయిందని విమర్శించారు. రేపు నిర్వహించే బంద్ లో పాల్గొనని వాళ్లు నిజంగా దేశ ద్రోహులేనని వ్యాఖ్యానించారు. మోదీ అనాలోచితంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా 120 మంది చనిపోయారని నారాయణ అన్నారు.

120 మంది మరణానికి కారకుడైన మోదీని 120 సార్లు నిలబెట్టి కాల్చినా తప్పులేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకే చెట్టుకు ఉన్న కొమ్మలని నారాయణ ఎద్దేవా చేశారు. ఈ పార్టీల వ్యవహారశైలి బయట గుద్దులాట.. లోపల ముద్దులాట తీరుగా ఉందని విమర్శించారు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీతో జట్టుకడతామని నారాయణ స్పష్టం చేశారు.

More Telugu News