Uttar Pradesh: వాట్సాప్ కారణంగా ఆగిపోయిన పెళ్లి!

  • వరుడి కుటుంబ సభ్యుల కొత్తవాదన
  • అమ్మాయి 24 గంటలు వాట్సాప్ లోనే ఉంటోందని వెల్లడి
  • పోలీసులను ఆశ్రయించిన వధువు కుటుంబీకులు

సాధారణంగా అడిగినంత కట్నం ఇవ్వలేదనో, గౌరవమర్యాదలు సరిపోలేదనో పెళ్లిళ్లు రద్దవుతూ ఉంటాయి. చాలాసార్లు వరుడి తరఫు బంధువులు అలగడం, వారిని వధువు తరఫువారు బుజ్జగించడం మనం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం విచిత్రంగా వాట్సాప్ కారణంగా ఓ పెళ్లి రద్దయిపోయింది. అమ్మాయి తండ్రి ముఖం మీదే ఈ పెళ్లి జరగదని వరుడి కుటుంబ సభ్యులు తేల్చిచెప్పేశారు.

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాకు చెందిన యువతికి లక్నోకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో శనివారం ఫంక్షన్ హాల్ వద్ద వధువు కుటుంబ సభ్యులు వరుడి రాకకోసం ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న వరుడి కుటుంబ సభ్యులు ఈ పెళ్లి జరగదని కుండబద్దలు కొట్టారు. అమ్మాయి 24 గంటలు వాట్సాప్ లోనే ఉంటోందనీ, వాట్సాప్ కు బానిసైన కోడలు తమకు వద్దని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ పెళ్లి కోసం వరుడి కుటుంబ సభ్యులు కట్నంగా రూ.64 లక్షలు డిమాండ్ చేశారనీ, అది ఇవ్వలేకపోవడంతోనే నిందలు వేస్తున్నారని వధువు తండ్రి వాపోయాడు. 

More Telugu News