Karnataka: కేసు నుంచి తప్పించుకోవడానికి లా చదివిన టెక్కీ.. అయినా వెంటాడిన దురదృష్టం!

  • కర్ణాటకలో యువతిని వేధించిన ప్రబుద్ధుడు
  • కేసు నమోదుతో లాయర్ గా కొత్త అవతారం
  • జైలుశిక్ష విధించిన న్యాయస్థానం

తనకు పరిచయమైన ఓ యువతితో టెక్కీ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఈ-మెయిల్ కు పంపడంతో పాటు ఇంటర్నెట్ లో ఉంచాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి లా చదివాడు. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ తప్పించుకునేందుకు యత్నించాడు. కానీ చివరికి కోర్టు అతడిని దోషిగా తేల్చడంతో కటకటాల వెనుక ఊచలు లెక్కిస్తున్నాడు.

కర్ణాటకలోని బాగల్ కోట్ కు చెందిన శివప్రసాద్ సజ్జన్ కు ఓ యువతి పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసిన నిందితుడు బాధితురాలి ఈ-మెయిల్ కు పంపడంతో పాటు ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆమె 2008లో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు శివప్రసాద్ ను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై విడుదలైన ప్రసాద్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు.

చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మూడేళ్ల లా డిగ్రీలో చేరాడు. క్రిమినల్ లాయర్ గా మారి తన కేసును తానే డీల్ చేశాడు. చట్టంలోని లొసుగులను తెలుసుకుని ఈ కేసును 10 ఏళ్ల పాటు అంటే 2018 వరకూ సాగదీశాడు. చివరికి ఈ కేసును విచారించిన బెంగళూరులోని ఓ కోర్టు శివప్రసాద్ నేరం చేసినట్లు ఇటీవల నిర్ధారించింది. అతనికి రెండేళ్ల జైలుశిక్ష విధించి న్యాయస్థానం.. రూ.25,000 జరిమానా కట్టాలని ఆదేశించింది. 

More Telugu News