Tirumala: 25 ఎకరాలు, రూ. 140 కోట్లు... అమరావతిలో 'ఆనందనిలయం'!

  • కోట్లాది మంది కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వరుడు
  • ఆగమ శాస్త్రయుక్తంగా అమరావతిలో ఆలయం
  • రెండో తిరుమలను చేస్తామంటున్న టీటీడీ

కోట్లాది మంది కొంగు బంగారమైన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు అమరావతిలో కొలువుదీరనున్నాడు. పవిత్ర కృష్ణా తీరంలో దాదాపు 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 140 కోట్ల అంచనా వ్యయంతో శ్రీవారి దేవాలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోనుంది. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడేలా, ఆగమ శాస్త్రయుక్తంగా, చోళ, పల్లవ, చాళుక్య నిర్మాణ రీతుల మేళవింపుతో రెండో తిరుమలగా ఇది తీర్చిదిద్దబడనుంది.

స్వామిని దర్శించుకునే భక్తులకు ప్రశాంత దర్శనంతో పాటు, తిరుమల తరహాలోనే ఆలయాన్ని నిర్వహించేలా చూస్తామని టీటీడీ చెబుతోంది. స్వామివారి విగ్రహం పడుకుని ఉందని భావిస్తే, గర్భాలయం శిరస్సుగా, అంతరాలయం మెడగా, మహామండపం భుజాలుగా... ఇలా ఆలయాన్ని నిర్మిస్తామని, తమిళనాడు, కాంచీపురం కైలాసనాథ ఆలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయాలకు దీటుగా ఈ ఆలయం ఉంటుందని అధికారులు వెల్లడించారు. శ్రీకృష్ణ దేవరాయలు హంపిలో నిర్మించిన విఠలాలయం తీరును మేళవించి ప్రాకారాలు నిర్మిస్తామని తెలిపారు. మానవునిలో ఉండే మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలను పోలేలా నూతన ఆలయం ఉంటుందని చెప్పారు.

కాగా, ఇప్పటికే స్థలాన్ని గుర్తించిన అధికారులు, ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని చదును చేయించి, అక్కడ పడివున్న వ్యర్థాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అన్ని అనుమతులు తీసుకుని, నవంబరులో దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తవుతుందని టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ వెల్లడించారు.

More Telugu News