Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగ భృతికి రంగం సిద్ధం.. 14న ప్రారంభం కానున్న వెబ్ సైట్!

  • అభ్యర్థులే నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం
  • శుక్రవారం ప్రారంభించనున్న సీఎం
  • డైరెక్టుగా బ్యాంకు ఖాతాలోనే డిపాజిట్

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిరుద్యోగ భృతిని అందించేందుకు ప్రభుత్వం తీసుకురానున్న ‘యువనేస్తం’ అమలు కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వెబ్ సైట్ లో నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకుంటే వారి బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా నగదును జమ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దాదాపు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత http://yuvanestham.ap.gov.in  వెబ్ సైట్ లో నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవాలని  ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సూచించారు. ఈ నెల 14న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ వెబ్ సైట్ ప్రారంభం కానుంది. 2 నుంచి 3 వారాల పాటు ఈ రిజస్ట్రేషన్ ను అనుమతిస్తామని అధికారి తెలిపారు. అనంతరం అక్టోబర్ 2 నుంచి యువతకు నిరుద్యోగ భృతిని నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేస్తామని వెల్లడించారు

ఈ నిరుద్యోగ భృతిని పొందాలంటే డిగ్రీ, పీజీ, డిప్లోమా చేసి ఏడాది పూర్తయి ఉండాలి. వయసు కూడా 22 నుంచి 35 సంవత్సరాల మధ్యే ఉండాలి. ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ డిగ్రీ చేసిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండటంతో పాటు వీరంతా ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. అలాగే యువత తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్, మొబైల్ నంబర్లను అనుసంధానం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటిదాకా అనుసంధానం కాకుంటే మీసేవ ద్వారా చేసుకోవాలని చెబుతున్నారు. తల్లిదండ్రులు పెన్షన్లు పొందుతున్నా, పిల్లలు నిరుద్యోగ భృతిని అందుకోవచ్చని స్పష్టం చేశారు.

కేవలం ఆర్థికంగా అండగా ఉండటమే కాకుండా నిరుద్యోగ యవతలో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చాలా కంపెనీలను ఈ పథకంలో భాగస్వాములను చేసింది. దీనికింద అభ్యర్థులకు ఇష్టమైన 3 కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఈ పథకానికి సంబంధించి యువత తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1100 లేదా yuvanestham-rtgs@ap.gov.in ను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

More Telugu News