Tamilnadu: వెలుగు నింపిన కోర్టు తీర్పు.. ప్రమాద బాధితునికి రూ.కోటి పరిహారం!

  • తక్షణం చెల్లించాలని బీమా కంపెనీకి ఆదేశం
  • తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లాలో 2013 మార్చి 10న ఏక్సిడెంట్‌
  • తీవ్రంగా గాయపడి చూపుకోల్పోయిన బాధితుడు

రోడ్డు ప్రమాదంలో చూపు కోల్పోవడంతో జీవితం అంధకారమయమై దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితుని జీవితంలో లోక్‌ అదాలత్‌  కోర్టు వెలుగు నింపింది. బాధితునికి తక్షణం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది. దీంతో కంపెనీ ప్రతినిధులు వెంటనే చెక్కు అందజేశారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌ జిల్లా కాంగేయం రోడ్డులోని అమర్‌జ్యోతి గార్డెన్‌కు చెందిన జయప్రకాష్‌భూపతి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌.

2013 మార్చి 10న భార్య సుమతితో కలిసి ద్విచక్ర వాహనంపై ముమ్మూర్తినగర్‌కు వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయపప్రకాష్‌ చూపు కోల్పోయారు. దీంతో బీమా సంస్థ నుంచి పరిహారం కోరుతూ భూపతి భార్య సుమతి 2013 జూన్‌లో తిరుప్పూర్‌ జిల్లా రెండో అదనపు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. శనివారం జరిగిన లోక్‌ అదాలత్‌లో భూపతి కుటుంబ సభ్యులు, బీమా కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం కోటి పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు రావడంతో బాధిత కుటుంబం అంగీకరించింది. 

More Telugu News