Tamilnadu: లంచాల కోసం ‘కలెక్షన్ హౌస్’.. డబ్బును లెక్కించడానికి ప్రత్యేకంగా సిబ్బంది!

  • వసూల్ రాజాగా మారిన ప్రభుత్వ అధికారి
  • తమిళనాడులోని వేలూరులో ఘటన
  • అరెస్ట్ చేసిన విజిలెన్స్ సిబ్బంది

ఆయన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి. తన వద్దకు వచ్చిన ఫైళ్లను చకచకా క్లియర్ చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం ఆయన విధి. కానీ ఆ అధికారి మాత్రం తన హోదాను అక్రమ సంపాదనకు తొలిమెట్టుగా వాడుకున్నాడు. లంచాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా ఆఫీస్ ను తెరవడంతో పాటు వచ్చే డబ్బుల సేకరణ, నిర్వహణ కోసం భారీగా సిబ్బందిని నియమించుకున్నాడు. చివరికి పాపం పండడంతో అధికారుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.

తమిళనాడులోని వేలూరు సత్ వచ్చారిలో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో సుబ్రమణియన్ అనే అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్రమ ఇళ్లు, ఫ్యాక్టరీలను క్రమబద్ధీకరించడం ఆయన విధి. ఇక్కడే సుబ్రమణియన్ చేతివాటం చూపించాడు. అనుమతులు, క్రమబద్ధీకరణ కోసం వచ్చే ఫైళ్లు క్లియర్ చేసేందుకు భారీగా లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టాడు. వసూళ్లు బాగా పెరగడంతో వాటి వసూలు, నిర్వహణ కోసం ఈ ప్రబుద్ధుడు ఓ ఆఫీసుతో పాటు ఏకంగా 38 మంది సిబ్బందిని నియమించుకున్నాడు.

ఈ టౌన్ ప్లానింగ్ కార్యాలయం అధికారుల వ్యవహారశైలిపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ డీఎస్పీ శరవణకుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఇక్కడ నిన్న దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రమణియన్ కలెక్షన్ హౌస్ గురించి తెలుసుకున్న అధికారులు అక్కడికెళ్లి రూ.3.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుబ్రమణియన్ ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News