Model: ఆన్‌లైన్ ద్వారా వేధిస్తున్న యువకుడిని పట్టుకునేందుకు 900 కిలోమీటర్లు ప్రయాణించిన మోడల్!

  • మోడల్ పేరుతో పలు ఫేక్ ఖాతాలు
  • తనతో రెండు రోజులు గడిపితే వాటిని డిలీట్ చేస్తానంటూ ఆఫర్
  • భర్తతో కలిసి ఖాండ్వా వెళ్లి నిందితుడి పనిపట్టిన మోడల్

ఎక్కడో కంప్యూటర్ ముందు కూర్చుని తనను వేధిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు 19 ఏళ్ల మోడల్ ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణించింది. నిందితుడిని పట్టుకుని బుద్ధి చెప్పేందుకు తన భర్తతో కలిసి ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాకు బయలుదేరింది.

మోడల్ ఫొటోలను సేకరించిన నిందితుడు వాటిని మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పలు నకిలీ ఖాతాలు సృష్టించాడు. ఆమె ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశాడు. అంతేకాదు, నిందితుడు తనపై యాసిడ్ పోస్తానని కూడా బెదిరించాడని బాధిత మోడల్ తెలిపింది. సింగర్, మోడల్ అయిన బాధితురాలు తనకు వచ్చిన బెదిరింపులపై ఢిల్లీలోని  సైబర్ క్రైమ్ పోలీసులు సహా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారి నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో నిందితుడు షకీర్ హుస్సే‌న్‌ను పట్టుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగింది.

  తనతో రెండు రోజులు గడిపితే తాను క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ అన్నీ డిలీట్ చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇదే మంచి అవకాశంగా భావించిన ఆమె అందుకు అంగీకరించింది. తద్వారా అతడిని పట్టుకోవాలని ప్లాన్ చేసింది. భర్తతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాకు రైలులో వెళ్లింది. అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను కలిసి విషయం చెప్పింది. తాను ఖాండ్వా వచ్చిన విషయాన్ని నిందితుడు షకీర్ హుస్సేన్‌కు బాధితురాలు తెలియజేసింది. తొలుత తనకు ఆరోగ్యం బాగాలేదన్న నిందితుడు.. ఆ వెంటనే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. పక్కనే సిద్ధంగా ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

అయితే, గంటలోనే బెయిలుపై బయటకు వచ్చిన నిందితుడు ఆ వెంటనే పలుమార్లు మోడల్‌కు ఫోన్ చేసి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. తనపై ఫిర్యాదు చేస్తే వదలబోనని హెచ్చరించాడు. దీంతో ఆమె మరోమారు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో మరోమారు అతడిని అదుపులోకి తీసుకున్న ఖాండ్వా పోలీసులు ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News