Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సరికొత్త చరిత్ర.. గ్యాలరీ నిర్మాణం దాదాపు పూర్తి!

  • ప్రాజెక్టు నిర్మాణంలో గ్యాలరీ కీలక నిర్మాణం
  • డ్యామ్ భద్రతకు ఇదే కీలకం
  • నీటి ఊటను బయటకు పంపడంలో కీలక పాత్ర

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో చరిత్ర నమోదైంది. పోలవరం గ్యాలరీ దాదాపు పూర్తయింది. డ్యామ్ భద్రత పరంగా ఇది అంత్యత ముఖ్యమైన నిర్మాణం. అంతర్భాగంలో ఊరే ఊటను తొలగించి డ్యామ్‌కు మరింత భద్రత కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇప్పుడిది దాదాపు పూర్తికావడంతో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ గ్యాలరీ ద్వారా స్పిల్‌వే అంతర్భాగంలో ఒక వైపు నుంచి మరోవైపునకు వెళ్లి ప్రాజెక్టు భద్రతను పర్యవేక్షించవచ్చు.

కాంక్రీట్ నిర్మాణం ఎంత బలంగా ఉన్నప్పటికీ నిత్యం వందల టీఎంసీల నీటిని నిల్వ చేయడం వల్ల నీటి చెమ్మ లోపలికి ఇంకుతుంది. ఆ చెమ్మ నీటి చుక్కల రూపంలో కిందికి పడుతుంది. ఇందుకోసం ప్రతీ మూడు మీటర్లకు ఒకటి చొప్పున ప్లాస్టిక్ పైపులు అమర్చారు. ప్రాజెక్టులో కింది నుంచి వచ్చే ఊట గ్యాలరీలో ఓ పక్కన నిర్మించిన కాలువలాంటి నిర్మాణంలోకి చేరుతుంది. ఆ తర్వాత ఆ నీటిని బయటకు వదిలేస్తారు.

స్పిల్‌వే మొత్తం పొడవు 1118 మీటర్లు కాగా, గ్యాలరీ నిర్మాణం 1054 మీటర్ల మేర పూర్తయింది. ప్రాజెక్టులో మొత్తం 52 గేట్లు ఉండగా, 48వ గేటు వద్ద దీనిని నిర్మించారు. అలాగే, గ్యాలరీలో మూడు వేర్వేరు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సమాంతరంగా మెట్లు కూడా నిర్మిస్తారు. గ్యాలరీలోని నీటి ఊట ఏ పరిమాణంలో ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూములను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన గ్యాలరీ నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో నిర్మాణ పనులు మరింత ఊపందుకున్నాయి.  

More Telugu News