Telangana: తెలంగాణ గడ్డపై పార్టీ నిలదొక్కుకునేలా నిర్ణయాలు తీసుకుంటా!: సీఎం చంద్రబాబు

  • తెలంగాణ గడ్డపై టీడీపీ ఉండాలి
  • ఇది చారిత్రక అవసరం
  • పార్టీని వీడిన వాళ్లు మళ్లీ టీడీపీలోకి వస్తున్నారు

తెలంగాణ గడ్డపై పార్టీ నిలదొక్కుకునేలా నిర్ణయాలు తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ గడ్డపై టీడీపీ ఉండాలని, ఇది చారిత్రక అవసరమని అన్నారు. పార్టీని వీడిన వాళ్లు మళ్లీ టీడీపీలోకి వస్తున్నారని, టీడీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే, భయపెడితే తాను భయపడే ప్రసక్తే లేదని, తన జీవితంలో ఎవరికీ భయపడలేదని అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసింది

ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలని ఢిల్లీ నేతలను తాను ఎన్నోసార్లు అడిగానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్శిటీ మంజూరు చేయాలని కోరానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు. అసలు, రాష్ట్ర విభజన చేయమని గానీ, వద్దని గానే తానేనాడూ చెప్పలేదని, అధికారం కోసం తెలుగుదేశం పార్టీ ఏనాడూ పాకులాడలేదని అన్నారు. 

More Telugu News