Chandrababu: లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం!

  • కాంగ్రెస్ తో పొత్తుపైనే ప్రధాన చర్చ
  • టీడీపీ ఎక్కడ ఏయే స్థానాల్లో బలంగా ఉందో విశ్లేషిస్తున్న చంద్రబాబు
  • కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటేనే మంచిదన్న టీటీడీపీ నేతలు

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణలో పొత్తుల దిశగా వివిధ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో ఓ ఆసక్తికర పొత్తుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడూ ఉప్పూనిప్పుగా ఉండే కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోబోతున్నాయనే వార్తలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో టీడీపీ అధినేత చంద్రబాబు టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పొత్తులపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే బాగుంటుందని టీటీడీపీ నేతలు చంద్రబాబుకు తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే, దాని ఫలితం ఎలా ఉంటుంది? జాతీయ రాజకీయాలపై దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? అనే అంశంపై సమావేశంలో చర్చ సాగుతోంది. తెలంగాణలో ఏయే స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది, ఏ నాయకులు బలంగా ఉన్నారు? కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? అనే విషయంపై చంద్రబాబు దృష్టి సారించినట్టు సమాచారం. ఇదే సమయంలో టీటీడీపీ మేనిఫెస్టోలో ఏయే అంశాలను పొందుపరచాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఈ సాయంత్రం జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

More Telugu News