british airways: బ్రిటిష్ ఎయిర్ వేస్ పై హ్యాకర్ల పంజా.. 3.8 లక్షల క్రెడిట్ కార్డుల సమాచారం తస్కరణ!

  • ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో హ్యాకింగ్
  • క్రెడిట్ కార్డులు బ్లాక్ చేయాలని సూచించిన సంస్థ
  • రంగంలోకి బ్రిటిష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ

ప్రముఖ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్ వేస్ కు హ్యాకర్లు షాకిచ్చారు. కంపెనీ వెబ్ సైట్, మొబైల్ యాప్స్ పై దాడిచేసిన హ్యాకర్లు 3.8 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలను చోరీ చేశారు. అంతేకాకుండా ఈ యాప్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడి పేరు, ఈ మెయిల్ ఖాతా వివరాలు మొత్తం హ్యాక్ చేశారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. తాజాగా తమ ప్రమేయం లేకుండానే క్రెడిట్ కార్డును వాడినట్లు పలువురికి మెసేజ్ లు రావడంతో ఈ హ్యాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయమై బ్రిటిష్ ఎయిర్ వేస్ సీఈవో అలెక్స్ క్రూజ్ మాట్లాడుతూ.. తమ కంపెనీపై సైబర్ దాడి జరిగిన మాట వాస్తవమేననీ, దాదాపు 3.8 లక్షల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, క్రెడిట్ కార్డుల సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కిందని వెల్లడించారు. ఈ ఘటనపై బ్రిటిష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశామనీ, వారు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని క్రూజ్ పేర్కొన్నారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకూ తమ వెబ్ సైట్, యాప్స్ నుంచి క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారు వెంటనే తమ కార్డులను బ్లాక్ చేయాలని సూచించారు.

More Telugu News