Telangana: తెలంగాణలో టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి
  • మళ్లీ కేసీఆర్ నియంత పాలన రాకూడదు
  • టీడీపీ సహా మిగిలిన పార్టీలు మాతో కలవాలి

తెలంగాణలో టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏక తాటిపైకి రావాలని కోరిన ఉత్తమ్, టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని పేర్కొన్కారు. మళ్లీ కేసీఆర్ నియంత పాలన రాకుండా ఉండాలంటే, టీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని, అందుకే, టీడీపీ సహా మిగిలిన పార్టీలన్నీ తమతో కలిసి రావాలని పిలుపునిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికలు ఒక ధర్మయుద్ధమని భావించి, ఈ యుద్ధంలో అవినీతిపరులు, దుర్మార్గులను మట్టికరిపించడానికి కలిసి రావాలని కోరుతున్నట్టు చెప్పారు.

ఉత్తమ్ కు ఎల్.రమణ ఫోన్?

పొత్తులపై చర్చించేందుకు కలుద్దామని ఉత్తమ్ కు టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఫోన్ చేసినట్టు సమాచారం. పొత్తు ప్రతిపాదనపై రేపటి టీ-టీడీపీ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

రేపు హైదరాబాదుకు చంద్రబాబు 

టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని ఉత్తమ్ ప్రకటించిన నేపథ్యంలో చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు హైదరాబాద్ కు రానున్నారు. చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో టీటీడీపీ-కాంగ్రెస్ పొత్తు విషయమై రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

More Telugu News