kcr: ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయన్ని కేసీఆర్ వ్యాఖ్యల పట్ల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పందన

  • ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం మాత్రమే ప్రకటించాలి
  • రాజకీయ నాయకులు ప్రకటించడం తప్పు
  • కేసీఆర్ మాట్లాడినట్టు నేను మీడియాలోనే చూశాను

తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ లో ఫలితాలు వెలువడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా కేసీఆరే చెప్పేస్తారా? అంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కేసీఆర్ వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పందించారు. కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి వ్యాఖ్యానించినట్టు తాను మీడియాలో చూశానని... ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం కాకుండా ఇతరులు ప్రకటించడం తప్పని అన్నారు. అసెంబ్లీలో కాని, ఇతర సభలో కాని రాజకీయ నాయకులు ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమని తెలిపారు.

వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని... అయితే, మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని రావత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నుంచి నివేదిక వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలను నిర్వహించేందుకు యంత్రాంగం, వసతులు, ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉంటే... ముందుగా నిర్వహించేందుకు తమకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు. 

More Telugu News