scst act: ఎస్సీ, ఎస్టీ వేధింపు చట్టం సవరణలపై అన్ని పార్టీలు కలిసి చర్చించాలి: లోక్ సభ స్పీకర్ మహాజన్

  • ఇందుకు అన్ని పార్టీలు పార్లమెంటులో ఆమోదం తెలిపాయి
  • చట్ట సవరణలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది
  • బీజేపీ వ్యాపారుల విభాగం సభలో సుమిత్రా మహాజన్

ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ కేంద్రం గత నెలలో సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ అగ్రకులాలకు చెందిన పలు సంఘాలు నిన్న దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా అన్ని పార్టీలు కలసి చర్చించాలని ఆమె వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చర్చ, ఓటింగ్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సవరణలకు ఆమోదం తెలిపాయని గుర్తుచేశారు.

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయరాదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అలాగే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని ఉన్న నిబంధనను కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం ఎక్కువగా దుర్వినియోగం అవుతోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో కేంద్రం స్పందించింది. సుప్రీం తీర్పు వర్తించకుండా ఎస్సీ,ఎస్టీ చట్టం(సవరణ)-2018ను గత నెలలో పార్లమెంటులో ఆమోదించింది.

తాజాగా బీజేపీ వ్యాపారుల విభాగం సమావేశంలో మహాజన్ ఈ విషయమై మాట్లాడుతూ ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. ‘నా పిల్లాడికి నేను ఓ పెద్ద చాక్లెట్ ఇచ్చాననుకోండి. కానీ అంత చాక్లెట్ ఒకేసారి తినేయడం వాడి ఆరోగ్యానికి మంచిది కాదని ఆ తర్వాత తెలుసుకున్నాను అనుకోండి. అప్పుడు నేనే కాదు ఎవరైనా పిల్లాడి నుంచి చాక్లెట్ ను వెనక్కి తీసుకోవాలనే అనుకుంటారు. కానీ మీరు బలవంతంగా లాక్కుంటే పిల్లాడు ఏడ్చి నానా యాగీ చేయడం మొదలుపెడతాడు.

కానీ కొంచెం తెలివైన  వ్యక్తి అంత చాక్లెట్ ను ఒకేసారి ఎందుకు తినకూడదో అర్ధమయ్యేలా చెప్పగలిగితే పిల్లాడు మాట వింటాడు. కొంచెం చాక్లెట్ తీసుకుని మిగిలింది వెనక్కి ఇచ్చేస్తాడు. ఎవరైనా ఓ వ్యక్తి దగ్గరున్న దాన్ని లాక్కోవడానికి యత్నిస్తే తీవ్ర ఆగ్రహం తలెత్తుతుంది. ఎస్సీ,ఎస్టీ సవరణ చట్టం విషయంలో విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని మహాజన్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం సమాజంలో ఉన్న అసమానతలు కొనసాగడం సరైనది కాదని మహాజన్ అన్నారు. గతంలో కొన్ని వర్గాలకు న్యాయం జరగలేదన్న కారణంతో ఇప్పుడు ఇంకొందరికి అన్యాయం చేస్తామనడం సరికాదని అభిప్రాయపడ్డారు.

More Telugu News