గాంధీ కుటుంబం చెప్పుకు కూడా కేసీఆర్ సరిపోరు: వీహెచ్

07-09-2018 Fri 14:56
  • కేసీఆర్ ఆయన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు
  • తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారు?
  • గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది

టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశంలోనే రాహుల్ గాంధీ పెద్ద బఫూన్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని వి.హనుమంతరావు మండిపడ్డారు. గాంధీ కుటుంబం చెప్పుకు కూడా కేసీఆర్ సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని... తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని వీహెచ్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని... ప్రతి జిల్లాలో బీసీలకు మూడు సీట్లను కేటాయించాలని ఆయన కోరారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని... ఇదే సమయంలో కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈరోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.