TRS: కాంగ్రెస్ నేత సురేశ్ రెడ్డిని స్వయంగా కలిసిన కేటీఆర్.. టీఆర్ఎస్ లో చేరే అవకాశం!

  • కీలక బాధ్యతలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధం
  • సానుకూలంగా స్పందించిన సురేశ్ రెడ్డి
  • జిల్లాలో డీఎస్ కి చెక్ పెట్టడానికే 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ తాజాగా ఇతర పార్టీల్లో సమర్ధులైన నేతలకు గాలం వేసేందుకు ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు స్వయంగా మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా సురేశ్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన అంగీకరిస్తే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ ఆఫర్ కు సురేశ్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 2004లో సురేశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2004 నుంచి 2009 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. తాజాగా నిజామాబాద్ లో డీఎస్ వ్యవహారం తలనొప్పిగా మారిన నేపథ్యంలో సురేశ్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా విజయావకాశాలను మెరుగుపర్చుకోవచ్చని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది. కేవలం సురేశ్ రెడ్డి మాత్రమే కాకుండా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ కి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కాంగ్రెస్ లోకి తిరిగివస్తారన్న నేపథ్యంలోనే సురేశ్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

More Telugu News