TRS: టీఆర్ఎస్ బఫూన్ల పార్టీలా వ్యవహరిస్తోంది!: కాంగ్రెస్ నేత జానారెడ్డి

  • ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు
  • 2 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఇచ్చారు
  • మీడియా సమావేశంలో మాట్లాడిన జానారెడ్డి

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్, దళితులకు ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల ఖర్చు, మూడెకరాల భూమి, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు వంటి ఏ హామీలు నెరవేర్చలేదని వెల్లడించారు. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మరో పదేళ్లయినా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయగలరా? అని జానారెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్ లోని తన నివాసంలో ఈరోజు జరిగిన అత్యవసర భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణతో కలసి జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మానుకోవాలని టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. టీఆర్ఎస్ బఫూన్ల పార్టీగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తామన్న కేసీఆర్, కేవలం గురుకులాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవహారశైలి తల, కాళ్లు వదిలేసి మొండెంను చూపించినట్లు ఉందని విమర్శించారు.

ప్రజలకు 2.82 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం, వీటిలో కేవలం 14 వేల ఇళ్లు మాత్రమే పూర్తిచేయగలిగిందని తెలిపారు. వీటిలో కేవలం 2 వేల మందికే ఇళ్లను కేటాయించారనీ, మిగిలిన ఇళ్లను కూలిపోయాక ఇస్తారా? అని జానారెడ్డి ప్రశ్నించారు. 2 లక్షల ఇళ్లు పూర్తిచేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని గతంలో అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారనీ, ఆయన నైతికతకు కట్టుబడతారా? లేదా? అన్నది ఆయనకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణను ఏర్పాటు చేయడానికే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజల ముందుకు వచ్చిందని జానారెడ్డి అన్నారు.

More Telugu News