Supreme Court: పౌర హక్కుల నేతల గృహ నిర్బంధం పొడిగింపు!

  • పౌర హక్కుల నేతల గృహ నిర్బంధాన్ని పొడిగించిన సుప్రీంకోర్టు
  • సీనియర్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ‘సుప్రీం
  • మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక

భీమా-కొరేగావ్ అల్లర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌర హక్కుల నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈనెల 12 వరకూ పొడిగించింది. గత నెల 28న మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విరసం నేత వరవరరావు సహా, పౌర హక్కుల నేతలు వెర్నన్ గొనెసాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే ఈ కేసు విషయమై సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. మహారాష్ట్రకు చెందిన  ఓ సీనియర్ పోలీస్ అధికారిపై ‘సుప్రీం’ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిందితులను గృహ నిర్బంధంలో ఆగస్ట్ 30 వరకూ ఉంచాలని మొదట సుప్రీం ఆదేశించింది. వారిని గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలంటూ దాఖలైన పిటీషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ కేసుకు సంబంధించి పుణె ఏసీపీ మీడియా సమావేశంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జోక్యం అనవసరమంటూ ఏసీపీ.. మీడియాతో అనడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ... ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

More Telugu News