Supreme Court: పోలవరంపై ఒడిశా వేసిన పిటిషన్‌లో పసలేదు.. కొట్టేయండి: సుప్రీంకోర్టును అభ్యర్థించిన కేంద్రం

  • ఏపీ ఇచ్చే పరిహారాన్ని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు
  • ముంపు ప్రాంతాల్లో అడ్డుగోడలు నిర్మించడం లేదు
  • ట్రైబ్యునల్ తీర్పు ప్రకారమే నిర్మాణ పనులు
  • సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎటువంటి ఉల్లంఘనలు జరగడం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. 1980లో గోదావరి ట్రైబ్యునల్‌ ఇచ్చిన అవార్డుకు లోబడే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పనుల నిలిపివేత ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తును కొట్టివేయాలని సుప్రీం కోర్టును అభ్యర్థించింది. ఒడిశా ప్రభుత్వానికి కౌంటర్‌గా కేంద్ర జలవనరుల శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను పేర్కొంది. పోలవరం పనులపై స్టే విధించడం ఇదే తొలిసారి కాదని, ఇప్పటి వరకు ఆరుసార్లు స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ప్రాజెక్టు కింద ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు సూచించినా ఇప్పటి వరకు స్పందన లేదని అఫిడవిట్‌లో ఆరోపించింది. ప్రాజెక్టు షెడ్యూలు మొత్తం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది.  ప్రాజెక్టు నిర్మాణంలో వందేళ్లకోసారి వచ్చే గరిష్ట వరదను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, 500 ఏళ్లకు ఒకసారి వచ్చేందుకు అవకాశం ఉన్న 36 లక్షల క్యూసెక్కులను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో అడ్డుకట్టలు నిర్మించుకోవడం కానీ, ఏపీ ఇచ్చే పరిహారాన్ని తీసుకోవడం కానీ చేయలేదని వివరించింది. కాబట్టి ఒడిశా ప్రభుత్వం చేస్తున్నఆరోపణల్లో పస లేదని, వాటిని కొట్టి వేయాలని అఫిడవిట్‌లో కోరింది.

More Telugu News