Telangana: గల్ఫ్ పంపిస్తానంటూ ఏజెంట్ మోసం.. 22 ఏళ్లుగా ముంబైలో అనాథలా రైతు.. అనారోగ్యంతో మృతి!

  • వ్యవసాయంలో అప్పులపాలైన రైతు
  • నమ్మి ఏజెంట్‌ను ఆశ్రయిస్తే మోసం
  • రెండు దశాబ్దాలుగా ముంబైలో అనామకుడిలా బతుకు 
  • ఈనెల 1న అనారోగ్యంతో కన్నుమూత

ఆ రైతుకు ఆత్మాభిమానం ఎక్కువ. వ్యవసాయంలో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అతడిని రుణగ్రస్థుడిని చేస్తే.. నమ్మిన ఏజెంట్ అతడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. అందరూ ఉన్నా 22 ఏళ్లపాటు ముంబైలో అనాథలా బతికాడు. చివరికి తనవల్ల కాదని ప్రాణాలు విడిచాడు. కన్నీళ్లకే కన్నీరు తెప్పించే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు..

అది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రాజక్కపేట. గ్రామానికి చెందిన రైతు కోమటిరెడ్డి జితేందర్ రెడ్డి (60) తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పొలంలో బోరు వేయించేందుకు అందినకాడల్లా అప్పులు చేశాడు. నీళ్లు పడకపోవడంతో అప్పులపాలయ్యాడు. అప్పులు చుట్టిముట్టి వేధిస్తుండడంతో గల్ఫ్ వెళ్లి డబ్బులు సంపాదించి తీర్చాలని నిర్ణయించుకున్నాడు.
 
ఎడారి దేశం వెళ్లేందుకు ఏజెంట్‌ను ఆశ్రయించాడు. అప్పుల్లో మునిగి, జీవితంలో కుంగిపోయిన రైతును ఏజెంట్ మోసగించాడు. గల్ఫ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని ముంబైలో వదిలిపెట్టాడు. ముంబైలో అడగుపెట్టాక గానీ అతడికి తెలియలేదు.. తాను మోసపోయానని. గల్ఫ్ వెళ్లలేక.. స్వగ్రామానికి తిరిగి రాలేక నలిగిపోయాడు. తిరిగి ఇంటికెళ్లి భార్య, పిల్లలకు ముఖం చూపించడం ఇష్టం లేక అక్కడే కూలి పనులు చేస్తూ రహస్యంగా ఉండిపోయాడు. ఈ నెల 1న అనారోగ్యంతో కన్నుమూశాడు.

చనిపోయే ముందు తనతో పాటు పనిచేసే కూలీలకు తన వివరాలు చెప్పాడు. తనది తెలంగాణ ముఖ్యమంత్రి  పక్క గ్రామమేనని చెప్పి కన్నుమూశాడు. సామాజిక మాధ్యమాల్లో రైతు ఫొటోను పెట్టిన తోటి కూలీలు ఎట్టకేలకు చింతమడక గ్రామస్థులకు వివరాలు అందించగలిగారు. ఆ గ్రామంలో ఉండే రాజక్కపేట గ్రామస్థులు ఫొటోను గుర్తించి రైతు జితేందర్ రెడ్డి భార్యకు సమాచారం అందించారు. రెండు దశాబ్దాల క్రితం ఇల్లొదిలిన భర్త మరణవార్త తెలిసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

More Telugu News