Susatya Rekha: రాజమహేంద్రవరం 'రేఖా టీచర్'పై ప్రధాని ప్రశంసల జల్లు!

  • ఉత్తమ ఉపాధ్యాయినిగా జాతీయ పురస్కారం
  • ఆటపాటలతో విద్యాభ్యాసం
  • మార్మోగుతున్న సుసత్య పేరు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నివేదిత కిశోర్‌ విహార్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మేకా సుసత్య రేఖ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సుసత్య రేఖ ఉత్తమ ఉపాధ్యాయినిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. అదే వేదికపై ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఆమె సృజనాత్మక బోధన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ ద్వారా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

స్కూలుకొచ్చే విద్యార్థికి తరగతి గది పులి బోనులా కనిపించకూడదని సుసత్య రేఖ నమ్ముతారు. అది ఎప్పటికీ పజిల్‌లా ఉండకూడదంటారు. సైన్స్, గణితం బోధించే ఆమె తన బోధనకు కాస్తంత సృజనాత్మకత జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. పిల్లలకు ఆమె బోధించే ‘మ్యాథ్స్ కబడ్డీ’ గురించి తెలిసి మోదీ ఆశ్చర్యపోయారు. ఒక్కో తరగతికి ఒక్కో పద్ధతిలో బోధిస్తూ పిల్లలకు గణితం, సైన్స్‌పై ఉండే భయాలను పారదోలారు. ‘మ్యాథ్స్‌ ప్రాజెక్ట్స్‌ ఎఫ్‌2’ పేరుతో ఒక యాప్‌ను, ‘రేఖా టీచర్‌ బడి’ పేరుతో బ్లాగ్‌ స్పాట్‌ను సుసత్య నిర్వహిస్తున్నారు.

పిల్లలతో ప్రాజెక్ట్ వర్క్స్ చేయించడమంటే ఇంటర్నెట్ నుంచి ఫొటోలు తీసుకుని తయారుచేయడం కాదని సుసత్య బలంగా నమ్ముతారు. ప్రాజెక్ట్స్ ఎప్పుడూ పిల్లల్లోని సృజనాత్మకశక్తిని వెలికి తీసేలా ఉండాలంటారు. పిల్లలకు ఆటపాటలంటే ఎంతో ఇష్టమని, అందుకనే తన పాఠాల్లో అవి రెండూ మిళితమై ఉంటాయని సుసత్య తెలిపారు.  
సుసత్య గురించి ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. పిల్లలను తరగతి గదివైపు ఆకర్షించడంలో సుసత్య రేఖ విజయం సాధించారని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె చేపట్టే కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.                                                                    

More Telugu News