jagan: జగన్ కు బహిరంగ లేఖ.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు!

  • అన్ని అంశాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ
  • మీ ఫ్యూడలిస్ట్ వ్యవహార శైలి నచ్చకే చంద్రబాబు వెంట
  • 30 ఏళ్ల అవినీతికి వారసుడివి నువ్వు

‘ఈ రోజే మీ ఫిరాయింపు మంత్రులు నలుగురిని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని తక్షణం పదవుల నుంచి తొలగిస్తే’ రేపటి నుంచి మీరు పెడుతున్న అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరుకావటానికి సిద్ధంగా ఉన్నామంటూ’ సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాయడం విదితమే.

ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ఈ లేఖకు దీటుగా సమాధానమిచ్చారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి  ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా..
 
‘శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
 
నమస్కారాలు

ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మీరు రాయించిన లేఖకు జవాబుగా, జరిగిన అన్ని అంశాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం.

మీ ఫ్యూడలిస్ట్ వ్యవహార శైలి నచ్చకే రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ.... పనిచేస్తున్న ముఖ్యమంత్రిని బలపరచడానికే మా అడుగులు వేశాం.

వయసు లేదు, అనుభవం లేదు, స్వతహాగా ఆలోచన లేదు, ప్రజలకు మేలు చేయాలన్న తపనతో మేము చేసే సలహాలు వినే నైజం లేదు. కేవలం సహ నిందితుల సలహాలతోనే ముందుకు సాగాలన్న నీ ఆలోచనను భరించలేక, అధికారమే పరమావధిగా కుట్రరాజకీయాలే ప్రధాన అజెండాగా కొనసాగిస్తూ, ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసే నీ నీచ మనస్తత్వాన్ని సహించలేక, పట్టిసీమ నిర్మాణాన్ని అడ్డుకోవాలన్న అంతర్గత సమావేశంలో నీవు వ్యక్తపరిచిన దురభిప్రాయంతో ఏకీభవించలేక, పోలవరం నిర్మాణాన్ని, పేద గిరిజనుల పునరావాసాన్ని ముందుకు సాగకుండా ప్రజలను ప్రభుత్వంపైకి ఉసిగొల్పాలన్న నీ ఆలోచనతో జీర్ణించుకోలేక, కొత్త రాజధానిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనివ్వకూడదన్న నీ అభిప్రాయంతో ఏకీభవించలేక, రాజధాని ప్రాంత రైతుల్లో ల్యాండ్ పూలింగ్ పై అపోహలు సృష్టించాలన్న నీ దుర్మార్గాన్ని తట్టుకోలేక, రాజధాని నిర్మాణాన్ని కోర్టు కేసులతో అడ్డుకోవాలన్న నీ ఆలోచనతో ఏకీభవించలేక, రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన సింగపూర్ సంస్థలకు, ఆర్కిటెక్ట్ లకు అసత్యాలతో, అడ్డుకోవాలన్న ఆలోచనలతో లేఖలు రాయడాన్ని సహించలేక, చివరికి  ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాన్నికూల్చివేయాలని రాజ్ భవన్ సాక్షిగా నీవు చేసిన ప్రకటన భరించలేక, ప్రజా సమస్య పరిష్కార వేదికగా ఉన్న శాసనసభలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా, చర్చ జరగకుండా, దుష్ట రాజకీయ తలంపుతో మమ్మల్ని ఉసికొల్పడం చూసి మనస్కరించక, ఎర్రటి ఎండలో పనిచేసి, చేసిన పనికి కూలీ కోసం ఎదురు చూసే ఉపాధి హామీ కూలీలకు వచ్చే నిధులు కూడా రాకుండా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కేంద్రానికి ఫిర్యాదులు చేసిన నీ నైజాన్ని సహించలేక, నమ్ముకున్న నీ బిజినెస్ పార్టనర్లను, ఐఏఎస్ అధికారులను నట్టేట ముంచిన నీ నైజాన్ని ఓర్చుకోలేక, కేసుల మాఫీ కోసం కేంద్రంతో మీ చీకటి ఒప్పందాలు, బీజేపీతో మీ పార్టనర్ షిప్ చూసి సహించలేక, రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన నరేంద్రమోదిని పల్లెత్తు మాట అనలేని, నీ ఉత్తర కుమార నైజాన్ని చూసి తట్టుకోలేక, ఫ్యాక్షన్ పునాదుల మీద నిర్మించబడ్డ నీ ఫ్యూడల్ మనస్తత్వాన్ని సమర్ధించలేక, మానసిక సంఘర్షణ భరించలేక, ప్రజల కోసం ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేశాం.

ప్రతి శుక్రవారం దొంగల్లా కోర్టుల చుట్టూ నువ్వు తిరుగుతుంటే నీతో ఉన్న మమ్మల్ని కూడా అలా చూస్తుంటే ఓర్చుకోలేక, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలబడ్డాం. మీ నాన్న రాజకీయ పుట్టుకే ఫిరాయింపులతో మొదలైందన్న విషయం నీకు గుర్తులేదా? కావాలంటే ఆనాడు శాసనసభలో నాటి ప్రతిపక్షనేత భాట్టం శ్రీరామమూర్తి మీ నాన్నపై చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే, ‘మధుపర్కాలతో మంగళ సూత్రాలతో పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయిన కొత్త పెళ్లికూతురిలా నీ(మర్రి చెన్నారెడ్డి) వైపు వెళ్లాడు మా రాజశేఖర రెడ్డి, ఏముంది నీలో ఆకర్షణ’ అని ఆనాటి రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు భాట్టం శ్రీరామమూర్తి శాసనసభలో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలి.

అంటే ఏ ఆకర్షణకు లోనై ఆరోజు వెళ్లాడు మీ నాయన... 1978లో రెడ్డికాంగ్రెస్ టిక్కెట్టు మీద గెలిచిన మీ నాయన రాజశేఖరరెడ్డి తరువాత రాజీనామా చేయకుండానే ఇందిరా కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవుల్లో పనిచేయలేదా? అప్పుడు మీ విలువలు ఏమయ్యాయి? 1993లో ఏడుగురు టీడీపీ ఎంపీలను (రెడ్డయ్య యాదవ్, విజయకుమార్ రాజు...) కాంగ్రెస్ లోకి లాక్కున్నప్పుడు ఈ విలువలు ఏమయ్యాయి? 2004లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మందిని తీసుకున్నప్పుడు మీ నాయన చేసింది పవిత్రమైన ప్రజాస్వామ్య యజ్ఞమా? రాజ్యాంగ పునరుద్ధరణ కార్యక్రమమా? పార్టీలను తుడిచి పెట్టాలన్న ఆలోచనతో ఆరోజు మీ నాయన చేసిన తప్పిదాలను చూడలేని గుడ్డివాడివా? లేక ప్రజలు మరిచి పోయారు అనుకుంటున్నావా? అణుఒప్పందం మీద పార్లమెంటులో ఓటింగ్ సందర్భంగా ఇద్దరు టీడీపీ ఎంపీలను లాక్కుని ఆరోజు పదవులు ఇచ్చిన విషయం గుర్తులేదా? 2009లో బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిలను తీసుకున్నప్పుడు ఎందుకని రాజీనామాలు చేయించలేదు? మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా?

రూ.30 కోట్లు అంటున్నావు. ఆ రోజు మీనాయన ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడు? ఆ తరువాత నీ దగ్గరకొచ్చిన వాళ్లకు నీవెన్నికోట్లు ఇచ్చావు? మీరెళ్తే ప్రజాస్వామ్యం? మేం చేస్తే అప్రజాస్వామ్యమా? మీ కుటుంబ రాజకీయ పుట్టుకే ఊసరవెల్లి పుట్టుక, హత్యలతో, రక్తపుటేరులతో మీ ఎదుగుదల. అలాంటి మీ నోటివెంట ధర్మపన్నాలా? నీకు, చంద్రబాబుకు పోలికెక్కడ? ముఖ్యమంత్రి పదవి కోసం ప్రధానమంత్రిపై చెప్పులు వేయించిన తండ్రి వారసత్వం నీది. కుర్చీ కోసం హైదరాబాద్ లో మతకల్లోలాలలో 300 మంది ప్రాణాలు బలిగొన్న రాక్షస వారసత్వానికి కొనసాగింపుగానే తెలుగుదేశం సభల్లో నీ మనుషులతో అల్లర్లు సృష్టిస్తావు..నీవా నీతి వాక్యాలు వల్లెవేసేది?

పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. శాసనసభ దెయ్యాల కొంపగా దెయ్యాలకే కనిపిస్తుంది. ఏది దొంగ సొత్తు?మమ్మల్ని దొంగ సొత్తు అనడం ద్వారా మా నియోజకవర్గ ప్రజలను అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు? తండ్రిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను వ్యాపారవేత్తలకు కట్టబెట్టి, క్విడ్ ప్రోకో ద్వారా లక్షల కోట్లు సొంతం చేసుకున్న నేరంపై కోర్టుల చుట్టూ తిరుగుతున్న నీవు, నీ బంట్రోతులు విలువల గురించి మాట్లాడటమా?అసత్య ఆరోపణలతో చంద్రబాబుగారిపై 26 విచారణలు చేయించి, చివరికి ఏమీ తేల్చలేక చేతులు ఎత్తేశాడు. మనీ లాండరింగ్ నేరాల్లో మెడలోతు కూరుకుపోయిన నువ్వు చంద్రబాబుపై చేస్తున్న అవాస్తవ ఆరోపణలను ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది నీ పొరబాటే.

శాసనసభకు హాజరు కాకూడదన్న నీ నిర్ణయమే ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. కోటి ఆశలతో ఓట్లేసి గెలిపించిన ప్రజల కష్టాలు, కన్నీళ్లు తీర్చే దిశగా ఎంతటి ప్రభుత్వాన్ని అయినా నిలదీస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాసన సభను వాడుకోకుండా గైర్హాజరు కావడం నీ అసమర్ధత అనుకోవాలా? పారిపోవడం అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? మూడు తరాల నేరమయ రాజకీయానికి, 30 ఏళ్ల అవినీతికి వారసుడివైన నీవా విలువల గురించి వల్లెవేసేది. శాసన సభకు హాజరు కాకపోవడాన్ని రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల విజయవాడలో ఉపాధ్యాయుల సభలో వారి ఆగ్రహం మీమీద పెల్లుబుకింది. అదీ మీ నుంచి ప్రజలు కోరుకుంటున్నది. ఇకనైనా నీ విధ్వంసక ధోరణిని విరమించుకోవాలి. ప్రజల బాటలో నడవాలి. రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలి. 5 కోట్ల ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్న నీ నైజాన్ని బహిర్గత పరచడానికే ఈ లేఖ రాస్తున్నాం.

ఈడీ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నువ్వు నీ ఆస్తుల పరిరక్షణ కోసం, నీ కేసుల నుంచి విముక్తి కోసం, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న నరేంద్ర మోదీకి పార్లమెంటు సాక్షిగా పాదాభివందనాలతో మోకరిల్లుతున్న వైనాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రం కోసం, భవిష్యత్ తరాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబును బలపరచడం ప్రతి తెలుగువాడి తక్షణ కర్తవ్యం. అందులోనే మేము సైతం...

భవదీయులు,

ఎస్డీ/ గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, అమరనాథ రెడ్డి, భూమా అఖిల ప్రియ, చాంద్ బాషా, జలీల్ ఖాన్, సర్వేశ్వర రావు, జయరాములు, మణిగాంధీ, పాశం సునీల్, గొట్టిపాటి రవికుమార్, అశోక్ రెడ్డి,రామారావు, డేవిడ్ రాజు, జ్యోతుల నెహ్రూ, వరుపుల  సుబ్బారావు, ఎస్ వి మోహన్ రెడ్డి, కలమట వెంకట రమణ, బుడ్డా రాజశేఖర రెడ్డి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News