Telangana: ముందస్తు ఎన్నికలపై మాకు ఎలాంటి సమాచారం లేదు: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్

  • తెలంగాణ సీఈఓతో అఖిలపక్ష నాయకుల సమావేశం
  • ఇది సాధారణ సమావేశం మాత్రమే
  • ఓటర్ల జాబితా ముసాయిదాపై మాత్రమే చర్చ జరిగింది 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. సచివాలయంలో రజత్ కుమార్ తో, అఖిలపక్ష నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ, ఇది సాధారణ సమావేశం మాత్రమేనని, ఓటర్ల జాబితా ముసాయిదాపై మాత్రమే చర్చలు జరిగాయని చెప్పారు.

ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా తాము సిద్ధమేనని, బ్యాలెట్ మిషన్లు, వీవీ పాట్ మిషన్లు, నవంబరు నాటికి సిద్ధంగా ఉంటాయని తెలిపారు.ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా 2018 జనవరి ఓటర్ల జాబితా ప్రకారమే ఈ ఎన్నికలు జరుగుతాయని, నామినేషన్లకు పదిరోజుల ముందు వరకు ఓటర్ల నమోదుకు అవకాశముంటుందని అన్నారు. కాగా, ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి గట్టు రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
 
ఈ  సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం సాగుతోందని, కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉందని, అక్రమ ఓటర్లను తొలగించాలని ఈసీని కోరినట్టు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా దంతాలపల్లిలో టీఆర్ఎస్ మద్దతుదారులు కానివారి ఓట్లను తొలగించారని ఆరోపించారు.

More Telugu News