Andhra Pradesh: సభ్యులడిగే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వాల్సిందే: ఏపీ శాసనమండలి చైర్మన్ ఎం.డి. ఫరూక్

  • ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు సమావేశాలు
  • ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ్యులడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాలి 
  • ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమాధానాల రూపంలో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి 

అసెంబ్లీలో సభ్యులు వేసే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వాల్సిందేనని ఏపీ శాసనమండలి చైర్మన్ ఎం.డి.ఫరూక్ స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇంత వరకూ జరిగిన 11 సెషన్లకు గానూ 792 ప్రశ్నలకు సమాధానాలు ఇంకా ఇవ్వాల్సి ఉందన్నారు. 2017 బడ్జెట్ సమావేశాల నుంచి పరిశీలిస్తే 283 ప్రశ్నలకు సమాధానాలు ఇంకా తెలపలేదన్నారు. జీరో అవర్ లో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి వేదికగా చేసుకుంటారన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ్యులడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఆయా శాఖలపై ఉందన్నారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్యం, ఉన్నత, ప్రాథమిక విద్యకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటాయని ఫరూక్ స్పష్టం చేశారు. అంటువ్యాధులు, ఏజెన్సీల్లో రోగాల వ్యాప్తిపై సభ్యుల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వ్యాధుల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమాధానాల రూపంలో చెప్పడానికి సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఆయన ఆదేశించారు.

More Telugu News