Andhra Pradesh: ఇవే చివరి పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు కావొచ్చు: ఏపీ స్పీకర్ కోడెల

  • ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు సమావేశాలు
  • విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది
  • ఆరోపణలకు తావివ్వరాదని అధికారులకు ఆదేశం

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ, గురువారం నుంచి ప్రారంభమయ్యే వర్షకాల సమావేశాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశాలు ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు జరగనున్నాయన్నారు. ప్రజల అవసరాలను బట్టి మరికొద్ది రోజులు పొడిగించే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల కార్యదర్శులు, అధికారులు సమావేశాలు జరిగే రోజుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

వివిధ సమావేశాల్లో జీరో అవర్ లో వేసిన 653 ప్రశ్నలకు ఇంకా సమాధానాలు ఇవ్వలేదన్నారు. ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాకుంటే వారిలో అసంతృప్తి చోటు చేసుకుంటుందన్నారు. ఇదే విషయమై కొన్ని సమావేశాల్లో సభ్యుల తమ అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. అధికారులు తమ తమ శాఖలకు చెందిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వాల్సిందేనని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు.

ఇవే చివరి సమావేశాలు కావొచ్చునని, ఉంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల ముందు నాలుగు రోజుల పాటే సాగే సమావేశాలు ఉండొచ్చునని ఆయన తెలిపారు. పూర్తి స్థాయిలో జరిగే ఈ సమావేశాలపై రాష్ట్ర ప్రజల దృష్టి ఉంటుందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రులు ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలకు తావివ్వరాదని అధికారులను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశించారు.

అనంతరం అధిక సంఖ్యలో రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పురపాలక శాఖల్లో పెండింగ్ లో ఉన్న ప్రశ్నల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శానసమండలి చైర్మన్ ఎం.డి.ఫరూక్, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

More Telugu News