jaiswal: ‘రాహుల్ సేఫ్టీనే నాకు ముఖ్యం.. అందుకోసం ఇల్లు, షాపులు అమ్మేసి విమానం కొంటా’ అంటున్న కాంగ్రెస్ నేత!

  • ప్రకటించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జైశ్వాల్
  • నిధులను కాంగ్రెస్ ఆఫీసుకు పంపిస్తామని వెల్లడి
  • తన స్నేహితులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారని వ్యాఖ్య

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి విమానంలో వెళుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. గాలిలో ఆటో పైలెట్ మోడ్ ఆఫ్ అయిపోవడంతో రాహుల్ విమానం ఒక్కసారిగా కొన్నివందల అడుగులు కిందకు జారిపోయింది. ఈ నేపథ్యంలో రాహుల్ భద్రత కోసం తాను అత్యాధునిక విమానాన్ని కొనుగోలు చేయనున్నట్లు ఆ పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ నేత అశోక్ జైశ్వాల్ ప్రకటించారు.

2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ ఈ విమానాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించారు. తొలుత విమానం కొనుగోలు చేసేందుకు నిధులు సేకరించాలని అనుకున్నాననీ, కానీ ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని తన ఇంటితో పాటు షాపులు అమ్మేయాలని నిర్ణయానికి వచ్చినట్లు జైశ్వాల్ పేర్కొన్నారు. తనతో పాటు తన స్నేహితులు కూడా స్వచ్ఛందంగా ఆస్తులు అమ్మేసేందుకు ముందుకు వచ్చారన్నారు. రాహుల్ ప్రయాణానికి అత్యంత సురక్షితమైన విమానాన్ని కొనేందుకు కాంగ్రెస్ నేతలు కూడా సాయం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఇల్లు, షాపుల అమ్మకానికి సంబంధించి పేపర్ ప్రకటనను విడుదల చేశారు.


రాహుల్ లాంటి నిజాయతీపరుడైన నేత క్షేమంగా ఉండేందుకే తాము విమానం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు జైశ్వాల్ తెలిపారు. తాము సేకరించిన నిధులను ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపిస్తామని వెల్లడించారు. మధ్యప్రదేశ్ కు చెందిన అశోక్ జైశ్వాల్ గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు.

More Telugu News