DS: కాంగ్రెస్ లో చేరనున్న డీఎస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్ఠానం!

  • టీఆర్ఎస్ లో గౌరవం దక్కకపోవడంతో నిర్ణయం
  • సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
  • ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా డీఎస్ వెంటే

టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్(డీఎస్) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్ పై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల కుమారుడు సంజయ్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆయనతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన గౌరవం దక్కకపోవడంతో బయటకు వెళ్లేందుకు డీఎస్ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

తాజాగా కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ తో జరిపిన చర్చలు ఫలించాయనీ, దీనికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపిందని సమాచారం. ఈ నెల 11న యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. డీఎస్ తో పాటు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

More Telugu News