harish rao: కేసీఆర్ కు కలసి వచ్చిన ప్రాంతం.. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం: హరీష్ రావు

  • హుస్నాబాద్ సభకు చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు
  • దగ్గరుంచి పనులను పర్యవేక్షిస్తున్న హరీష్ రావు
  • కాంగ్రెస్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్న హరీష్

టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న హుస్నాబాద్ బహిరంగసభకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రగతి నివేదన సభలో నాలుగున్నరేళ్ల ప్రగతిని ప్రజలకు వివరించామని చెప్పారు. హుస్నాబాద్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక సెంటిమెంట్ అని... గత ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించారని తెలిపారు. ఈ సారి కూడా హుస్నాబాద్ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమనే విషయం అందరికీ తెలిసిందేనని హరీష్ అన్నారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. టీఆర్ఎస్ గెలుపుపై ప్రజలకు, నాయకులకు ఎలాంటి అనుమానం లేదని... అయితే, ఎంత ఎక్కువ మెజార్టీ సాధిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరమని అన్నారు. కేసీఆర్ ప్రజల ముఖ్యమంత్రి అని, ప్రజల ఆలోచనలే కేసీఆర్ ఆలోచనలని చెప్పారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని... వ్యక్తిగతంగా దానిపై తాను ఏమీ చెప్పలేనని అన్నారు. 

More Telugu News