Congress: పెట్రోలు ధరల పెరుగుదలపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ రెడీ!

  • కలిసి వచ్చే పార్టీలతో నిరసన
  • రేపు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం
  • కేంద్రం మెడలు వంచేందుకు వ్యూహ రచన

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రభుత్వంపై ప్రతిరోజు విరుచుకుపడుతూ ఊపిరాడకుండా చేస్తున్న కాంగ్రెస్ తాజాగా పెట్రోలు ధరలపై సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని రచించాలని నిర్ణయించింది. అందులో భాగంగా గురువారం ఏఐసీసీ సీనియర్ సభ్యులు.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులతో సమావేశం కానున్నారు.

పెట్రో ధరలపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టే విషయమై చర్చించనున్నారు. అంతేకాదు, ఈ నిరసనల్లో తమతో కలిసి రావాలంటూ ఇతర పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. పెట్రో ధరల పెంపుతో చిరువ్యాపారులు, రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారి బాధ ప్రభుత్వానికి అర్థం కావడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. నిరసనలతో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని అన్నారు.

2008లో తాము అధికారంలో ఉన్నప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 138 డాలర్లు ఉంటే పెట్రోలు ధరను రూ.5 పెంచామని, దీంతో లీటర్ ధర రూ.45 నుంచి రూ.50కి చేరుకుందని మరో నేత మనీశ్ తివారి తెలిపారు. అప్పట్లో రూ.5 పెంచినందుకు బీజేపీ దానిని ఆర్థిక ఉగ్రవాదంగా అభివర్ణించిందని పేర్కొన్నారు. మరి ఇప్పుడేమనాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పెట్రో ధరలు ఎడాపెడా పెంచిన కేంద్రం ఇప్పటికే రూ.11 లక్షల కోట్లను జేబులో వేసుకుందని ఆరోపించారు. ధరల పెంపుపై నిలదీస్తే.. ధరల పెరుగుదల వల్ల రాష్ట్రాలకే లాభమంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మనీశ్ తివారి దుమ్మెత్తి పోశారు.

More Telugu News