Telugudesam: రేపు టీడీపీలోకి కొండ్రు మురళి... వ్యతిరేకిస్తున్న సీనియర్లతో చంద్రబాబుకు తలనొప్పి!

  • మురళి చేరికను వ్యతిరేకిస్తున్న ప్రతిభా భారతి
  • పదేళ్లుగా ఉన్న తనను ఎలా కాదంటారని ప్రశ్న
  • బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు

మాజీ మంత్రి కొండ్రు మురళి రేపు సీఎం చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకోనుండగా, పలువురు సీనియర్లు ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, మురళి రాకను వ్యతిరేకిస్తుండగా, నేడు ఆమెను తన వద్దకు రావాలని చంద్రబాబు కబురు పెట్టినట్టు సమాచారం. రాజాం నియోజకవర్గ టికెట్ ను మురళికి ఇస్తామని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పినందునే ఆయన పార్టీ మారే నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తుండగా, ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఉన్న ప్రతిభా భారతి చాప్టర్ క్లోజ్ అన్న ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా తనకు వ్యతిరేకంగా కళా వెంకట్రావు ఉన్నారని, ఆయనే కొండ్రు మురళిని తెరపైకి తెచ్చారని, పదేళ్లుగా కష్టపడుతున్న తనను కాదని ఆయనకు టికెట్ ఎలా కన్ఫర్మ్ చేస్తారని ప్రతిభా భారతి ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి 2009, 2014 ఎన్నికల్లో రెండుసార్లు ప్రతిభకు వరుసగా టికెట్లు ఇచ్చినా, ఆమె విజయం సాధించలేదు. అందువల్లే ఈ దఫా ఆమెకు బదులుగా మరో బలమైన నేతకు టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ప్రతిభా భారతిని బుజ్జగించేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి మారుతుందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇదిలావుండగా, కనిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఉగ్ర నరసింహారెడ్డి సైతం టీడీపీలో చేరనున్నారని వార్తలు వస్తుండటంతో, అక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే కదిరి బాబూరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఎంతమంది చేరినా లాభమేనన్నట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ, నేతల అసంతృప్తి వల్ల వచ్చే తలనొప్పులు చాలా చిన్నవన్న భావనలో ఉంది.

More Telugu News