Chandrababu: చంద్రబాబు రూ.1200 కోట్లకు పైగా వరాలను ముస్లింలపై కురిపించారు: ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్

  • ముస్లింల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు  
  • కాంగ్రెస్ హయాంలోనే ఉర్దూ భాష నిరాదరణకు గురైంది
  • పదవుల పంపకంలో ముస్లింలకు చంద్రబాబు పెద్దపీట  

గుంటూరులో ఇటీవల జరిగిన ‘నారా హమారా..టీడీపీ హమారా’ సభలో సీఎం చంద్రబాబునాయుడు రూ.1200 కోట్లకు పైగా వరాలను ముస్లింలపై కురిపించారని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని, నాలుగేళ్లలో ముస్లింల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను చంద్రబాబు చేపట్టారని ప్రశంసించారు.

ఈ సభకు 15 వేల మంది ముస్లిం మహిళలు హాజరయ్యారు

ఒక రాజకీయ పార్టీ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ముస్లింలు ఎప్పుడూ హాజరుకాలేదని, 15 వేల మంది ముస్లిం మహిళలు బురఖాలు ధరించి ఈ సభకు హాజరయ్యారని హిదాయత్ అన్నారు. వంద మంది కవులు, కళాకారులు కూడా పాల్గొన్నారని అన్నారు. ఎప్పుడూ దైవచింతనలో ఉండే ముఫ్తీలు కూడా సభకు హాజరై, నాలుగు గంటలకు పైగా సాగిన వేదికపైనే ఉండి సీఎం చంద్రబాబునాయుడును ఆశీర్వదించారని చెప్పారు. ముఫ్తీలందరూ ఐదారు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సభకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

చంద్రబాబు అధికారంలోకొచ్చాక ఒక్క అంగుళం కూడా కబ్జా కాలేదు

కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమయ్యాయని హిదాయత్ ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే వక్ఫ్ బోర్డుకు చెందిన భూముల్లో ఒక్క అంగుళం కూడా కబ్జాకు గురికాలేదని, కాంగ్రెస్ హయాంలో అన్యాక్రాంతమైన భూముల్లో 5 వేల ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుని, వక్ఫ్ బోర్డుకు అప్పగించారని అన్నారు.

వాస్తవం ఇలా ఉంటే టీడీపీ హయాంలో వక్ఫ్ బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయనడం సరికాదని, కాంగ్రెస్ హయాంలోనే ఉర్దూ భాష నిరాదరణకు గురైందని, పదవుల పంపకంలో ముస్లింలకు సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేశారని, ఆరుగురు కార్పొరేషన్ల చైర్మన్లు, ఇద్దరు మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, ప్రభుత్వి విప్, శాసనమండలి చైర్మన్ పదవులను ముస్లింలకు ఇచ్చారని కొనియాడారు.  

More Telugu News