kcr: ఈ నెల 7న హుస్నాబాద్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

  • బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు 
  • ‘ప్రజల ఆశీర్వాద సభ’ పేరిట భారీ బహిరంగ సభ
  • 50 రోజుల్లో వంద బహిరంగ సభలు నిర్వహిస్తాం: హరీశ్  

ఈ నెల 7న సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లు, సభాస్థలిని మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే సతీశ్ పరిశీలించారు. అనంతరం, హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రజల ఆశీర్వాద సభ’ పేరిట ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నదే ప్రధాన ఉద్దేశమని, 50 రోజుల్లో వంద బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ, 50 వేల మందితో ఈ సభ నిర్వహిస్తామని, టీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని ప్రజలను కోరతామని చెప్పారు. కాగా, పండితుల సూచనల మేరకు శ్రావణమాసంలో బహిరంగ సభ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. తొలి బహిరంగసభను నిర్వహించేందుకు హుస్నాబాద్ ను ఎంపిక చేశారు. స్థానిక ఆర్టీసీ బస్సు డిపో పక్కనే ఉన్న స్థలంలో ఈ సభ జరగనుంది.

More Telugu News