Samsung: భారత్ లో టీవీల తయారీని నిలిపివేయాలని శాంసంగ్ నిర్ణయం!

  • దిగుమతి సుంకం పెంచడంతోనే
  • నేరుగా టీవీల దిగుమతికే మొగ్గు 
  • ఫోన్ల తయారీపై దృష్టి

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టీవీ విడిభాగాలపై భారత ప్రభుత్వం దిగుమతి సుంకం విధించడంతో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌లో టీవీల తయారీని నిలిపివేసి వియత్నాం నుంచి నేరుగా టీవీలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టీవీల తయారీకి అవసరమయ్యే ముఖ్యమైన విడిభాగాలు, మరికొన్నింటిపై ప్రభుత్వం దిగుమతి సుంకం విధించింది. దీంతో టీవీల తయారీ వ్యయం తడిసిమోపెడు అవుతుండడంతో నేరుగా వాటినే దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై శాంసంగ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

చెన్నైలో శాంసంగ్‌కు ఉన్న తయారీ యూనిట్‌లో ఏడాదికి దాదాపు 3 లక్షల టీవీలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు వాటి ఉత్పత్తిని క్రమంగా తగ్గించి, ఆ తర్వాత పూర్తిగా నిలిపి వేయాలని యోచిస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానిక సప్లయర్ల వద్ద ఇప్పటికే ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, టీవీల ఉత్పత్తిని తగ్గించి ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా మొబైల్ ఫోన్ల తయారీపై దృష్టి సారించనున్నట్టు శాంసంగ్ ఇటీవలే ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ సమక్షంలో కంపెనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం శాంసంగ్ ఏడాదికి 68 మిలియన్ హ్యాండ్‌సెట్‌లను ఉత్పత్తి చేస్తుండగా, దానిని 120 మిలియన్లకు పెంచాలని భావిస్తోంది.

More Telugu News