Telangana: ఎల్లుండే తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయనున్న కేసీఆర్?

  • తొలుత రెండు మార్లు సమావేశం కావాలని భావించిన కేసీఆర్ క్యాబినెట్
  • ఒక్క సమావేశంలోనే అన్ని నిర్ణయాలూ తీసుకునే అవకాశం
  • ఉద్యోగుల మధ్యంతర భృతిపై తేలగానే అసెంబ్లీ రద్దు!

ఈ నెల 6వ తేదీ గురువారం నాడు తెలంగాణ మంత్రి మండలి సమావేశమై శాసనసభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు ఓ మారు, ఆపై అసెంబ్లీ రద్దుకు మరోమారు క్యాబినెట్ సమావేశమవుతుందని వార్తలు వచ్చినా, ఒక్క సమావేశం మాత్రమే ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ఆదివారం నాడు నిర్వహించిన సమావేశంలో, మరో రెండు మూడు రోజుల్లో ఇంకోసారి సమావేశమవుదామని కేసీఆర్ చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై సీఎస్ ఎస్కే జోషి ఆదేశాల మేరకు మంత్రిమండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అన్ని శాఖల అధికారులూ నివేదికలు పంపడం ప్రారంభించారు.

ఇక ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఉద్యోగుల మధ్యంతర భృతి అంశం ప్రధానమైనది. దీనికి క్యాబినెట్ ఆమోదం అవసరం లేదని, ఓ జీవో జారీ చేస్తే చాలని ప్రభుత్వ వర్గాలు అంటుండగా, దీనిపై స్పష్టత లేదు. ఒకవేళ, రేపు ఉద్యోగ వర్గాలను చర్చలకు ఆహ్వానిస్తే, రేపే ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసి, ఆపై 6న దానికి ఆమోదం పలికి, అదే రోజు సభ రద్దుకు సిఫార్సు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నత స్థాయి వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News