Hyderabad: హైదరాబాద్ నిజాం మ్యూజియంలో ఘరానా చోరీ.. కోట్ల విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు వస్తువుల అపహరణ!

  • వెంటిలేటర్ నుంచి తాడు సాయంతో లోపలికి
  • వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, కప్పు సాసర్ సెట్ చోరీ
  • మ్యూజియం గురించి తెలిసిన వారి పనేనని అనుమానం

హైదరాబాద్ పాతబస్తీలోని పురానా హవేలీలో ఉన్న నిజాం మ్యూజియంలో ఘరానా చోరీ జరిగింది. నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఉపయోగించిన పలు వస్తువులు అపహరణకు గురయ్యాయి. మ్యూజియం వెనుకవైపున మొదటి అంతస్తులో ఉన్న వెంటిలేటర్ ఇనుప గ్రిల్స్‌ను తొలగించిన దుండగులు తాడు సాయంతో లోపలికి ప్రవేశించారు. అనంతరం విలువైన వస్తువులను దోచుకుని వెళ్లిపోయారు.

రోజూలానే సోమవారం మ్యూజియాన్ని తెరిచిన సిబ్బంది దొంగతనం విషయాన్ని గుర్తించారు. వజ్రాలు పొదిగిన దాదాపు మూడు కేజీల బరువైన బంగారు టిఫిన్ బాక్స్, వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు టీకప్పు.. సాసర్.. స్పూన్ చోరీకి గురయ్యాయి. వీటి విలువ కోట్లలో ఉంటుందని మ్యూజియం అధికారులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియం, అలారం పనిచేసే విధానం గురించి తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News