ap7am logo

‘పోల‌వరం’ ముంపు ప్రాంత నిర్వాసితులపై వివక్ష తగదు: చంద్రబాబుకు రఘువీరా లేఖ

Mon, Sep 03, 2018, 04:03 PM
  • నిర్వాసితులకు న్యాయం చేయాలి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి
  • ముంపు ప్రాంతాలలో మా నాయకులు పర్యటించారు
పోల‌వరం ప్రాజెక్టు ముంపు ప్రాంత నిర్వాసిత ప్రజల‌పై జరుగుతున్న ఘోరమైన వివక్ష, అన్యాయాన్ని సరిదిద్ది అందరికీ న్యాయం చేసే విధంగా తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ బహిరంగ లేఖ రాశారు.

‘ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి చెందిన సీనియర్‌ నాయకుల‌ బృందం 2018 ఆగస్టు 10,11 తేదీల‌లో పోల‌వరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన చింతూరు, వి.ఆర్‌.పురం, కూనవరం, ఎటపాక, కుకునూరు, ఏలేరుపాడు, బూర్గంపాడు మండలాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో నిర్వాసిత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకోవడం జరిగింది.

నాతో పాటు రాష్ట్ర మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్‌గారు, కనుమూరి బాపిరాజుగారు, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజుగారు, పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రఫీవుల్లాబేగ్‌ గారు, ఏపీసీసీి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ గారు, ఏపీసీసీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాధంగార్లతో పాటు మరికొంతమంది సీనియర్‌ నాయకులు ఈ బృందంలో వున్నారు.

తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాలలో నిర్వాసితులయ్యే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మా బృందానికి నిర్ఘాంతపోయే వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చెప్పారు.

గత నాలుగు సంవత్సరాలుగా ఈ ముంపు మండలాలలోని ప్రజల‌కు అసలు ప్రభుత్వం వుందా? అనే ప్రశ్న నిర్వాసిత ప్రజల‌ నుండి ఎదుర్కోవడం మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా నిర్మాణం అవుతోన్న పోల‌వరం జాతీయ ప్రాజెక్టు కోసం సర్వస్వాన్నీ త్యాగం చేస్తున్న తమ పట్ల  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  నిర్లక్ష్యం వహించడమే కాదు పూర్తి వివక్ష చూపుతున్నాయని, తాము ఈ దేశంలోనే ఉన్నామా? రాజ్యాంగబద్ధ, ప్రజాస్వామిక పాల‌నలోనే ఉన్నామా అనే ప్రశ్న బాధితులమైన తమకు తలెత్తుతోందని చెప్పినప్పుడు మాకు నోటమాట రాలేదు.

‘పోలవరం’ కోసం తెంగాణ నుంచి 7 మండలాలను కలిపే వరకూ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనన్నానని పదే పదే ప్రచారం చేసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి తాము ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో, ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నామో అని ఎప్పుడైనా పలకరించారా? కనీసం ఆయన ప్రతినిధిగా సంబంధిత మంత్రి అయినా ఇటువైపు కన్నెత్తి చూశారా? అని నిలదీసినప్పుడు మౌనం దాల్చడం మా వంతైంది.

‘పోల‌వరం’ సత్వర నిర్మాణం జరగాలనే పేరుతో ప్రాజెక్టు నిర్మాణ పనులను చట్టవిరుద్దంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి రాష్ట్రానికి బదలాయించుకున్న ముఖ్యమంత్రి, ప్రతి సోమవరం పోలవరంపై సమీక్ష చేస్తూ విస్తృత ప్రచారం కల్పించుకుంటున్న ముఖ్యమంత్రి మా ముంపుప్రాంత నిర్వాసితుల సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఒక్క సోమవారమైనా ఎందుకు కేటాయించలేదని నిర్వాసితులు ప్రశ్నించినప్పుడు.. మీరు ఎందుకు మాట్లాడలేదో మాకు కూడా సమాధానం దొరకలేదు.

‘పోల‌వరం’ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల పేరిట రాజకీయ దళారీతనం, దోపిడీ, రాజకీయ ఆధిపత్యం, అవినీతి రాజ్యమేలుతున్నాయని ఉదాహరణతో ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నప్పుడు ఆశ్చర్యం చెందటం తప్ప మారు మాట్లాడలేని స్థితి మాకు ఏర్పడింది.

 ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజాజీవన భద్రతకు మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, రోడ్లు, సంక్షేమం, సహాయం, అభివృద్ధి చేపట్టాల్సిన అవసరమే లేదన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 4 ఏళ్లుగా వ్యవహరించడం అమానవీయం, నేరపూరితం అని చెప్పక తప్పడంలేదు.

మరీ ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో అత్యంత బాధ్యతతో గుర్తుపెట్టుకోవాల్సిన వారు ఆదివాసీ గిరిజనులు. అడవే జీవనాధారంగా జీవించే వీరికి మైదాన ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేసేటప్పుడు ఆదివాసీ గిరిజనుల భయాందోళనలను దృష్టిలో పెట్టుకోవాలి. వారి జీవన భధ్రతకు, రక్షణకు పూర్తి భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి.

కానీ, గడచిన నాలుగేళ్ళలో రాష్ట్ర కేబినెట్‌లో గిరిజనుల‌ నుంచి మంత్రి వర్గంలో చోటులేకుండా చేశారని దీన్నిబట్టి తమకు ఎలాంటి న్యాయం జరుగుతుందో అర్థం అవుతోందని, నిర్వాసిత గిరిజన ప్రజలు చెప్పినప్పుడు,  వారు ఏ విధంగా అభధ్రతకు గురవుతున్నారో ద్వితీయశ్రేణి పౌరులుగా భావించబడుతున్నారో తెలిసి బాధ కలిగింది.

 పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్‌ పార్టీ మానసపుత్రిక అని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన దగ్గర నుండి కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలోనే రూ.5,500 కోట్లు ఖర్చుచేయడం వరకూ, ప్రాజెక్టును జాతీయ హోదాగా ప్రకటించి మొత్తం వ్యయాన్ని కేంద్రమే చెల్లిస్తుందని చట్టం చేసే వరకూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న కమిట్‌మెంట్‌ను మీకు గుర్తు చేయాల్సిన పనిలేదు. ఈ సందర్భంలో పోవరం ప్రాజెక్టు శంకుస్థాపన సమయాన యూపీఏ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ నాటి జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ గారు మాట్లాడిన మాటను మీకు గుర్తుచేయడం అవసరమనిపిస్తోంది.

‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక కన్ను అయితే ఈ ప్రాజెక్టు ముంపునకు గురయ్యే నిర్వాసిత ప్రజలకు న్యాయం చేయడం మరో కన్నుగా భావించాలి. ప్రాజెక్టు నిర్మాణం పేరిట ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకూడదు’ అని నాడు శ్రీమతి సోనియాగాంధీ గారు చెప్పారు. మాటలు చెప్పడమే కాదు, యూపీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదాగా ప్రకటించి మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించేలా చట్టం చేయించడంతో పాటు, ముంపునకు గురయ్యే ప్రజల‌కు గరిష్ట న్యాయం చేయడం కోసం కట్టుదిట్టమైన 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కృషి చేశారు.

దురదృష్టం ఏమంటే, భారీ ప్రాజెక్టు వలన నిర్వాసితులయ్యే వారికి, భూములు కోల్పోయే రైతుల‌కు, రైతుకూలీలకు న్యాయం జరిగేందుకు సహాయపడే 2013 భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు, కొద్దిమంది బడా కార్పొరేట్‌ శక్తుల‌ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్నారు.

మూడు సార్లు ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని మార్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం బలవంతంగా ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గారు అనేక రాష్ట్రాల్లో ‘రైతు భరోసా’ పేరుతో పాదయాత్ర చేసి ఉద్యమించడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వంపై వత్తిడి పెంచాల్సి వచ్చింది. చివరకు ప్రజాగ్రహానికి తలొగ్గి ఎన్డీయే ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని మార్చలేకపోయింది. ( అయినా మీరు రాష్ట్రంలో ఈ చట్టానికి తూట్లు పొడిచారు)
పోల‌వరం ప్రాజెక్టు కారణంగా దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇళ్ల‌ను, తమ ఊరునీ, తమకు జీవనాధారమైన అడవినీ, భూముల్నీ, సమస్త జీవనాధారాన్నీ త్యాగం చేస్తున్న నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందనే భావనను నిర్వాసిత ప్రజలు వ్యక్తం చేశారు.


పోల‌వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని అధికంగా పెంచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి వున్న శ్రద్ధ, ఆసక్తి నిర్వాసితులమైన తమకు న్యాయం చేయడంలో లేదని వాపోయారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల‌ను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్న ప్యాకేజీ పథకంలో తమకు అమలు కావాల్సిన పునరావాస, సహాయం నిధుల‌ విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీని తీసుకుందో తమకు అర్థం కావట్లేదని నిర్వాసిత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదంతా మీకు ఎందుకు గుర్తుచేయాల్సి వస్తోందంటే ‘పోల‌వరం’ ముంపు ప్రాంత ప్రజల‌కు చాలా వరకు రక్షణ కవచంగా నిలిచింది, న్యాయం జరిగేందుకు ఉపకరిస్తున్నదీ 2013 భూసేకరణ చట్టమేనని నిర్వాసిత ప్రజలు ముక్త కంఠంతో చెప్పారు. పోల‌వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో ముంపు ప్రాంతా ప్రజల‌లెవ్వరికీ కన్నీళ్ళు రాకుండా వీరి పట్ల తొలి ప్రాధాన్యంతో, జవాబుదారీ తనంతో, పారదర్శకంగా, న్యాయంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి.

ఆఖరి నిర్వాసిత వ్యక్తికి కూడా న్యాయం జరిగే వరకూ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ‘పోల‌వరం’ వల్ల ల‌బ్ది పొందే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అంతరాత్మ క్షోభిస్తుందని అభిప్రాయపడుతున్నాం. ‘పోల‌వరం’ ముంపు ప్రాంత ప్రజల‌ు మా బృందం దృష్టికి తెచ్చిన అనేక సమస్యల్లో కొన్ని ముఖ్యమైన వాటిని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ఈ సమస్యల‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి బాధిత నిర్వాసితులకు గరిష్ట న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టాని కోరుతున్నాం.

1) నిర్వాసితుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలి

తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తమను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం, వివక్ష చూపుతోందని ఆవేదనతో చెబుతూ అసలు మాకు ప్రభుత్వం వుందా? అని దీనంగా నిర్వాసితులు వాపోతున్నారు. కనుక  పోల‌వరం ముంపు ప్రాంత నిర్వాసిత ప్రజలకు రోజువారీ ప్రభుత్వ సహాయక, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. నిర్వాసితుందరూ ఖాళీ చేసే వరకూ అన్ని సౌకర్యాలు, సంక్షేమం అందించాలి. అన్నిటికీ మించి వారికి అండగా ప్రభుత్వం వుందనీ, తమకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలి.

2) ముంపు ప్రాంతాలకు వైద్యం నిలిపివేయడం అమానుషం

చింతూరు మండంలోని ఏరియా ఆసుపత్రిలో డాక్టరుని నియమించని కారణంగా తాము వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నామని వైద్యం అందక కొందరు చనిపోయారని బాధగా చెప్పారు. వర్షాకాల సీజనల్‌ వ్యాధులు ముసురుకునే ప్రమాదం వున్నందున ముంపు ప్రాంతాల్లో ప్రజందరికీ పూర్తి వైద్య సదుపాయం అందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాల‌ని కోరారు.

3) ముంపు ప్రాంతాల  పిల్ల‌ల‌కు విద్యా హక్కును నిరాకరించకూడదు

ప్రభుత్వ పాఠశాల‌ల్లో ఖాళీ అయిన ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తోందని, తమ పిల్ల‌ల‌కు చదువు కోసం బవంతంగా ఈ ప్రాంతం వదిలిపోవాల‌నే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధంగా వివక్షతతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీరామగిరి గ్రామంలో ప్రజలు చెప్పారు. ముంపు ప్రాంత పిల్ల‌ విద్యాహక్కును హరించే చర్యను ప్రభుత్వం విడనాడి వెంటనే ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఖాళీను భర్తీ చేయాని కోరారు.

4) ముంపు ప్రాంతాల‌కు ప్రభుత్వ సంక్షేమాన్ని ఎగ్గొట్టడం అమానవీయం

రేషన్ కార్డుల్లో దొర్లిన తప్పును సరిదిద్దకపోవడం, కొందరికి రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం, అన్ని సంక్షేమ కార్యక్రమాల‌కూ రేషన్‌కార్డును లింక్‌చేయడం కారణంగా తమ కుటుంబాల్లో ఎలాంటి సంక్షేమం అందకుండా ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తున్నదని ఇది కూడా ఒక పద్ధతి ప్రకారమే చేస్తున్నారని సామాన్య పేదలు వాపోయారు. ప్రభుత్వ సహాయంలో పేదల‌కు ఎలాంటి అవాంత‌రాలు లేకుండా చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

5) 2013 భూసేకరణ చట్టాన్ని అంతటా ఒకే విధంగా పారదర్శకంగా అమలు చేయాలి

2013 భూసేకరణ చట్టాన్ని ( రీహేబిలిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌మెంట్‌ను) పునరావాసం, పరిహారంను  ముంపు ప్రాంతాలు మొత్తానికీ ఒకే విధంగా వర్తింప జేయాల‌ని, ఎలాంటి రహస్యం లేకుండా పారదర్శకంగా, ప్రజలందరికీ తెలిసే విధంగా అమలు చేయాల‌ని డిమాండ్‌ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక విధంగా, తూర్పుగోదావరి జిల్లాలో మరో విధంగా రాజకీయ ప్రాబ‌ల్యంతో చట్టాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో పూర్తి అవకతవకలు జరుగుతున్నాయని కూడా చెప్పారు.

2018 సంవత్సరానికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ వివాదాల్లో నలిగిపోతే మరో 20 సంవత్సరాలు అయినా, ప్రాజెక్టు పూర్తి కాదనే ఆందోళనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీసీసీ బృందం ఇప్పటికే 3 సార్లు పోల‌వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల‌ను కూడా ప్రత్యక్షంగా పరిశీలించిందని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాం.

6) 2013 చట్టానికి ముందు తక్కువ మొత్తంలో పరిహారం పొందిన వారికి కూడా  2013 చట్టాన్ని అమలు చేయాలి

గతంలో ప్రారంభమై ఇంకా నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టు ప్రాంత నిర్వాసితుల‌కు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పునరావాసం, పరిహారం చెల్లించాల‌ని చట్టం చెబుతున్నందున 2013 భూసేకరణ చట్టం రాకముందు నాడు ప్రభుత్వం అమలు చేసిన ప్యాకేజీని తీసుకున్న ప్రతి ఒక్కరికీ కూడా నూతన 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పునరావాసం, పరిహారం ఇచ్చి తమకు న్యాయం చేయాల‌ని,  అవసరమైతే ముందు తీసుకున్న పరిహారాన్ని మినహాయించుకోవాల‌ని కూడా నిర్వాసితులు కోరుతున్నారు.

7) ప్రాజెక్టు పూర్తయ్యే తేదీకి 18 ఏళ్ళు నిండిన వారందరికీ పరిహారం అందించాలి

ఇప్పుడు సర్వే చేసి 18 ఏళ్ళకు ఒక్కరోజు తక్కువైనా వారిని పునరావాసం, పరిహారం నుంచి ప్రభుత్వం మినహాయిస్తోందని దీని వలన తీవ్రమైన అన్యాయమవుతుందని కనుక పోల‌వరం ప్రాజెక్టు పూర్తయ్యే తేదీ నాటికి18 ఏళ్ళు నిండుతున్న వారందరికీ కూడా పునరావాస, పరిహారం అందించాల‌ని యువకులు కోరుతున్నారు. అంతేకాదు నిర్వాసిత ప్రాంతాల‌కు చెందిన నిరుద్యోగుల‌కు ప్రాజెక్టు పనులు ఉద్యోగాల‌ను ఇవ్వాల‌ని కోరారు. వి.ఆర్‌.పురం మండలంలోని పొల్లాల్లో పని చేస్తున్న మహిళల‌ను విచారించగా తాను డిగ్రీ వరకూ చదువుకున్నానని కానీ కూలీకి రావాల్సి వస్తోందని ఒక యువతి చెప్పింది. అంతేకాదు తన భర్త ఇంజనీరింగ్ చేసి ఇంటి వద్దే ఖాళీగా వుంటున్నాడని వాపోయింది. ప్రభుత్వం ఈ ప్రాంత నిరుద్యోగుల పట్ల ప్రత్యేక దృష్టితో వ్యవహరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాల‌ని కోరింది.

8) అన్ని రకాల‌ భూముల‌కూ ఒకేరకమైన పరిహారం ఇవ్వాలి

ముంపు ప్రాంతాల్లోని అన్ని రకాల‌ భూముల‌కు (డిపట్టా, పోడు, అసైన్డ్‌, దేవాదాయ, డిజాల్డ్‌, తదితర) ఒకే రకమైన నష్ట పరిహారం చెల్లించాల‌ని రైతులు కోరుతున్నారు. కొంత మంది రాజకీయ నాయకుల‌ ప్రాబల్యంతో కొందరు అధికారులు తమ ఇష్టానుసారం భూముల విలువ‌లు కేటాయించి అక్రమాల‌కు పాల్ప‌డుతున్నారని కూడా చెప్పారు.

9) గిరిజన, గిరిజనేతరుల మధ్య  వైషమ్యాలు సృష్టించకూడదు

పునరావాసం, పరిహారం అందించడంలో నిర్వాసితుల‌ను గిరిజనులు, గిరిజనేత‌రులు అనే బేధం చూపకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించాల‌ని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గిరిజనుల‌కు ప్రాధాన్యం ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని ఆ పేరుతో గిరిజనేతరుల‌కు అన్యాయం చేయకూడదని చెప్పారు.

10) పాక్షిక ముంపు మండలాల‌ను పూర్తి ముంపు మండలాలుగా ప్రకటించాలి

ఒక రైతుకు 10 ఎకరాలు భూమి వుంటే 5 ఎకరాలు మాత్రమే ముంపున‌కు గురవుతుందని చెప్పి, ఆ రైతుల‌ను అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస ప్రాంతానికి తరలిస్తూ మిగతా 5 ఎకరాల‌కు పరిహారం ఇవ్వమని చెప్పడం వల‌న ఆ రైతుల‌కు అన్యాయం జరుగుతోంది. కనుక పాక్షిక ముంపు మండలాల్లోని ముంపు భూముల‌న్నింటినీ ప్రభుత్వం సేకరించి రైతుల మొత్తం భూమికి పరిహారం ఇవ్వాలి. కొన్ని గ్రామాల్లో పాక్షికంగా ముంపు గురవుతున్నా అక్కడి ప్రజలంతా వారి భూముల నుంచీ ఖాళీ చేయాల్సి వస్తున్నందున మొత్తం భూముల‌కు పరిహారం ఇవ్వాల‌ని రైతులు కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముంపున‌కు గురికాకపోయినా ఆ భూముల‌కు ప్రభుత్వం పరిహారం ఇచ్చినట్లు రైతులు ఉదాహరణలు చెప్పారు. 

11) నిర్వాసితుల కోసం నాణ్యమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలి 

నిర్వాసితుల‌కు ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లు అగ్గిపెట్టె మాదిరిగా వున్నాయి. పూర్తి నాసిరకంగా కూడా వున్నాయి. ఎటపాక మండలంలోని కాపవరంలో పీసీసీ బృందం స్వయంగా చూసిన ఇళ్లు అయితే చాలా ఘోరంగా వున్నాయి. ఈ ఇంట్లో భార్య లోపల‌ ఉంటే భర్త బయట వుండాల్సినంత ఇరుకుగా వున్నాయి. ఆశ్చర్యం ఏమంటే కాపవరం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ గ్రామంలోనే నిర్వాసితుల‌కు ఇళ్ళ నిర్మాణం చేపడుతోంది. నిర్వాసితుల‌కు  ఒక పద్ధతి అంటూ లేకుండా ఇష్టానుసారం ఇళ్ళ కేటాయిస్తున్నారు. తండ్రికి ఒకచోట కొడుకుకు మరోచోట ఇస్తున్నారు. తుష్టువారి గూడెం ప్రజల‌కు కాపవరంలో సుమారు 60కిలో మీటర్ల దూరంలో ఇళ్లు కేటాయిస్తున్నారు. అన్నిటికన్నా సాధారణ పేదల‌పై చూపే దయ, జాలితో కాకుండా నిర్వాసితుల‌ను సర్వస్వాన్ని   త్యాగం చేస్తున్న త్యాగపరులుగా ప్రభుత్వం చూడాల్సి వుందని, వారికి కట్టే ఇళ్ళు విశాలంగా వుండే విధంగా నాణ్యమైన డబల్‌బెడ్‌ రూము ఇళ్లు కట్టించి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

12) స్థానికత కారణంతో ఇక్కడి విద్యార్థులు భవిష్యత్తు అవకాశాలు కోల్పోకూడదు

తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ముంపు మండలాల్లో చదువుకుంటున్న పిల్ల‌ల‌కు స్థానికత సమస్య కూడా ప్రధానంగా ముందుకు వచ్చిందని కొందరు ఉన్నత విధ్యావకాశాల‌ను ఇప్పటికే కోల్పోయారని కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని విద్యావంతులైన పిల్ల‌లందరికీ స్థానికత వర్తించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని  కోరుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీలో కలిసిన విద్యావంతుల‌ భవిష్యత్తు అవకాశాల‌ను కోల్పోకుండా ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాల‌ని అభ్యర్థించారు.

13) బీసీలుగా వున్న మున్నూరు కాపుల‌కు ఏపీ ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్‌ల‌ను నిరాకరించకూడదు 

తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపు కుల‌స్థులు బీసీ జాబితాలో వున్నారు. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి కలిసిన మండలాల్లోని మున్నూరు కాపుల‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బీసీలుగా గుర్తించకుండా నిరాకరిస్తోందని, దీని వల‌న తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మున్నూరు కాపు ప్రజలు కోరారు. ఈ విషయంలో తమ పిల్ల‌ల‌ భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని  తమను బీసీలుగా గుర్తించాల‌ని కోరారు.

14) ముంపు ప్రాంత పేదల‌కు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీతోపాటు జీవన భృతి ఇవ్వాలి

ముంపు ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలు భూమి లేని వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల‌ వారు, చిన్నవ్యాపారులు, అనాధలు, వృద్ధులు, తమ జీవనాధారాన్ని కోల్పోయి పునరావాస ప్రాంతాల‌కు తరుతున్నందున ఇలాంటి వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తింప చేయడంతోపాటు వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి నెల నెలా కనీసం 5 వేలు చొప్పున 10 ఏళ్ళ పాటు జీవన భృతి ఇవ్వాల‌ని పేదలు కోరుతున్నారు.

15) పునరావాస, పరిహారంలో లింగ వివక్ష లేకుండా మహిళల‌కు న్యాయం చేయాలి

పునరావాస, పరిహారం సహాయక చర్యలలో మహిళల‌ను పట్టించుకోకుండా పురుషుల‌కే వర్తింపచేయడం అన్యాయమని జెండర్‌ వివక్ష లేకుండా మహిళల‌ను కూడా సహాయ పరిహారంలో ప్రాధాన్యంగా తీసుకోవాల‌ని మహిళలు కోరారు.

16) ఇల్లొక చోట.. భూమి మరోచోటా ఇవ్వొద్దు. రెండూ ఒకే ప్రాంతంలో ఇవ్వాలి 

భూములు కోల్పోతున్న నిర్వాసితుల‌కు భూములు ఒక చోట, వారి నివాసం కోసం ఇచ్చే ఇళ్లు మరోచోట ఉంటోందని, కనుక భూమి ఇచ్చిన ప్రాంతాల్లోనే వారికి ఇళ్లు కూడా ఇవ్వాల‌ని కోరుతున్నారు. అలాగే తండ్రికి ఒకచోట ఇళ్లు కుమారుడికి మరోచోట ఇళ్లు ఇవ్వడం వల‌న వృద్ధాప్యంలో పిల్ల‌ల‌
సహాయం లేని పరిస్థితి రావచ్చు. కనుక ఇలా జరగకుండా చూడాల‌ని అభ్యర్థిస్తున్నారు.

17) నిర్వాసితుల‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక విభాగం, అధికార యంత్రాంగం కావాలి

నిర్వాసిత ప్రాంత ప్రజల సమస్యల‌ను వినడానికి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని, ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని నియమించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు.

18) ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు నాన్‌రెసిడెంట్‌ సమస్య తలెత్తకుండా చూడాలి

ముంపు మండలాల్లోనే పుట్టి ఇతర ప్రాంతాల‌కు బతుకుదెరువు కోసం వస్తూ వెళ్ళిన వారిని నాన్‌ రెసిడెంట్‌ కింద ప్రభుత్వం చూస్తోందని, కనుక ఇలాంటి వారిని రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటరు కార్డు సహాయంతో గుర్తించి వారందరికీ కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాల‌ని కోరుతున్నారు.

19) పశువుల పాకల‌కు, పేద పూరి గుడిసెల‌కూ ఒకే వెల‌ కట్టడం అన్యాయం

పశువుల‌ పాకల‌కు, పేదలు నివసించే పూరి గుడిసెల‌కు ఒకే రకంగా వెల‌కట్టి 25 వేల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించడం అన్యాయమని, తమకు పరిహారం చెల్లించడంతోపాటు డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాల‌ని గుడిసెవాసులు వాపోయారు.

20) రాజకీయ పెత్తందార్లను, మధ్య దళారుల‌ను, అవినీతిని అరికట్టాలి

ముంపు ప్రాంతాల‌ ప్రజల‌కు అందివ్వాల్సిన పునరావాసం, పరిహారం విషయంలో రాజకీయ పెత్తందారులు, మధ్య దళారుల‌ పాత్ర, అన్నింటా అవినీతి యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనివల‌న నోరులేని పేదలు, అమాయక గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిహారం ఇవ్వడానికి ఎకరానికి ల‌క్ష రూపాయల‌ను మధ్య దళారులు డిమాండ్‌ చేస్తున్నారని ఈ పరిస్థితిని ప్రభుత్వం అదుపు చేయాల‌ని కోరారు. పునరావాసం, పరిహారం చెల్లింపున‌ను పారదర్శకంగా అందరికీ తెలిసే విధంగా ప్ర తిగ్రామంలో నోటీసు బోర్డు ద్వారా తెలియజేయాల‌ని దీని ద్వారా అపోహలు తలెత్తకుండా వుంటుందని ప్రజలు కోరతున్నారు.

పైన పేర్కొన్న పోల‌వరం ముంపు ప్రాంతాల‌ ప్రజలు డిమాండ్లన్నీ న్యాయ సమ్మతమేననీ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నమ్ముతోంది. ఈ సమస్యల‌న్నింటినీ వెంటనే పరిష్కరించడానికి, ఆఖరి నిర్వాసితుని వరకూ గరిష్ట న్యాయం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో, దృఢనిశ్చయంతో పారదర్శకంగా జవాబుదారీతనంతో కృషి చేయాల‌ని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ తరపున డిమాండ్‌ చేస్తున్నాం’ అని ఆ సుదీర్ఘ లేఖలో రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
కాగా, పైన పేర్కొన్న సమస్యల‌న్నీ సెప్టెంబర్‌ 20 వ తేదీ లోపు పరిష్కరించని పక్షంలో 20వ తేదీ తర్వాత నిర్వాసిత ప్రజల‌తో కలిసి ప్రత్యక్ష ఆందోళనల‌కు దిగాల్సి వస్తుందని రఘువీరారెడ్డి హెచ్చరించారు.                                        
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Garudavega Banner Ad
IC - Shoora EB5 Banner Ad
Marri Sasidhar Reddy comments on Uttam Kumar Reddy..
Marri Sasidhar Reddy comments on Uttam Kumar Reddy
Udyama Simham Movie Official Teaser- KCR Biopic..
Udyama Simham Movie Official Teaser- KCR Biopic
Chandrababau speaks to media over blocking CBI..
Chandrababau speaks to media over blocking CBI
Next Enti Theatrical Trailer- Sundeep Kishan, Tamannaah, N..
Next Enti Theatrical Trailer- Sundeep Kishan, Tamannaah, Navdeep
Every Telugu person should listen to this; Akella Raghaven..
Every Telugu person should listen to this; Akella Raghavendra in Australia
Jagan on knife-attack; slams Chandrababu..
Jagan on knife-attack; slams Chandrababu
CM Wife Bhuvaneswari, & Manchu Manoj Enjoys F1 Boat Ra..
CM Wife Bhuvaneswari, & Manchu Manoj Enjoys F1 Boat Race
Ex- CBI JD Lakshmi Narayana reacts over CBI no entry in AP..
Ex- CBI JD Lakshmi Narayana reacts over CBI no entry in AP
KTR Super Punch To Repoter..
KTR Super Punch To Repoter
Watch: Rakul Preet Singh Gym Workout Video..
Watch: Rakul Preet Singh Gym Workout Video
Congress Releases 3rd List with 13 Candidates..
Congress Releases 3rd List with 13 Candidates
Ponnala Lakshmaiah finally gets Janagaon Seat..
Ponnala Lakshmaiah finally gets Janagaon Seat
Suhasini Files Nomination for Kukatpally Seat..
Suhasini Files Nomination for Kukatpally Seat
Actress Kushboo sensational comments on KCR..
Actress Kushboo sensational comments on KCR
40 TS Cong Rebels To Form A Front On Same Symbol!..
40 TS Cong Rebels To Form A Front On Same Symbol!
Nandamuri Ramakrishna on Suhasini entry into politics..
Nandamuri Ramakrishna on Suhasini entry into politics
KTR About Attack On YS Janan And Harikrishna Demise..
KTR About Attack On YS Janan And Harikrishna Demise
LIVE: Nandamuri Suhasini, daughter of Harikrishna..
LIVE: Nandamuri Suhasini, daughter of Harikrishna
Undavalli Aruna Kumar About Restrictions On CBI In AP..
Undavalli Aruna Kumar About Restrictions On CBI In AP
Anasuya Fun Moment With Turkish Ice Cream Seller..
Anasuya Fun Moment With Turkish Ice Cream Seller