begger: మానవత్వానికి కొత్త అర్థం.. కేరళ వరద బాధితులకు యాచకుడి సాయం!

  • ముందుకొచ్చిన మోహనన్
  • తాను యాచించిన సొమ్ము అందజేత
  • సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

సాయం చేసేందుకు మంచి మనసు ఉంటే సరిపోతుందనీ, పెద్ద హోదా, స్థాయి అవసరం లేదని ఓ యాచకుడు నిరూపించాడు. భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు తన వంతుగా సాయం అందించాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళను ఆదుకునేందుకు ప్రజలు రూ.1,000 కోట్లకు పైగా విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మోహనన్ అనే యాచకుడు ఎర్రట్టుపట్ట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ టీఎం రషీద్ ఇంటికి వెళ్లాడు. అతడిని గమనించిన రషీద్ ఓ రూ.20 నోటును జేబు నుంచి బయటకు తీశాడు. కానీ అది పట్టించుకోకుండా ఆయన ఇంటి ముందు కూర్చున్న మోహనన్.. తన దగ్గరున్న చిల్లరను లెక్కపెట్టి రూ.94ను రషీద్ కు అందించాడు. తన వంతుగా ఈ మొత్తాన్ని వరద బాధితులకు అందించాలని కోరాడు.

ఇందుకోసం దాదాపు 4 కి.మీ నడిచి మోహనన్ రషీద్ ఇంటికి చేరుకున్నాడు. దీంతో రషీద్ ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి పంపాడు. ఈ విషయాన్ని రషీద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మోహనన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News