Brazil: బ్రెజిల్‌లోని 200 ఏళ్లనాటి మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం!

  • పోర్చుగీసు రాజకుటుంబం నివసించింది ఈ భవనంలోనే
  • లక్షలాది అపురూప, చారిత్రక వస్తువులకు చోటు
  • నష్టాన్ని విలువ కట్టలేమన్న అధ్యక్షుడు

బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఉన్న 200 ఏళ్ల నాటి పురాతన నేషనల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మ్యూజియంలో మొత్తం అత్యంత అరుదైన 20 మిలియన్ వస్తువులు ఉండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమెర్ ట్వీట్ చేస్తూ.. దేశ ప్రజలకు ఇదో విషాదకరమైన రోజుగా పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కారణంగా సంభవించిన అపార నష్టానికి విలువ కట్టలేమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఏడాదితోనే ఈ మ్యూజియానికి 200 ఏళ్లు నిండాయి. ఒకప్పుడు ఈ భవనం పోర్చుగీసు రాజకుటుంబం నివాసంగా ఉండేది. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నదీ, లేనిదీ ఇప్పటి వరకు తెలియరాలేదు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే భవనం వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఓవైపు మంటలు ఆర్పుతూనే, మరోవైపు అందులోని విలువైన వస్తువులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు.

మ్యూజియం అగ్నిప్రమాదానికి గురవడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందించారు. తమ విచారాన్ని వ్యక్తం చేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ మ్యూజియంలో మమ్మీలు, అరుదైన శిలాజాలు ఉన్నాయి. బ్రెజిల్, ఇతర దేశాల చరిత్రకు చెందిన వేలాది వస్తువులు ఇందులో కొలువై ఉన్నాయి. అంతేకాదు, 12 వేల ఏళ్లనాటి మహిళ అస్థిపంజరం, డైనోసార్ల ఎముకలు కూడా ఉన్నాయి.

More Telugu News