Venkaiah Naidu: వెంకయ్యతో ఉంటే ఇబ్బందే!: మోదీ చమత్కారం

  • వెంకయ్యపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
  • క్రమశిక్షణకు ఆయన మారుపేరు
  • వెంకయ్య జనాల మధ్య ఉండాలని కోరుకుంటారు: జైట్లీ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రయాణించే సమయంలో ఆయనలా క్రమశిక్షణ పాటించకుంటే ఇబ్బందుల్లో పడతామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. క్రమశిక్షణకు ఆయన మారుపేరని ప్రశంసించారు. సమయ పాలన విషయంలో వెంకయ్య చాలా కచ్చితంగా ఉంటారని, ఎవరైనా పాటించకపోతే అసహనం ప్రదర్శిస్తారని మోదీ గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి పదవిలో వెంకయ్యనాయుడు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సచిత్ర సంక్షిప్త సంకలనం ‘‘మూవింగ్‌ ఆన్‌... మూవింగ్‌ ఫార్వర్డ్‌’’ను రూపొందించారు. దీనిని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ పాటించమని చెప్పడం పెద్ద నేరంగా అయిపోయిందని, అలా చెప్పే వారిని నియంతలుగా, అప్రజాస్వామిక వాదులుగా ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి అయ్యాక ఆ పదవికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారని, సరికొత్త నిర్వచనాన్ని కల్పించారని మోదీ ప్రశంసించారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి తన కేబినెట్‌లో వెంకయ్యనాయుడుకు కీలక పదవి ఇవ్వాలని భావించారని, కానీ వెంకయ్య అందుకు ఇష్టపడలేదని, తర్వాత గ్రామీణాభివృద్ధి పదవి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారని మోదీ గుర్తు చేసుకున్నారు.

వెంకయ్యనాయుడు జనంమధ్య ఉండాలని కోరుకుంటారని, అదే ఆయన సహజ లక్షణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఒక ఏడాదిలో 330 సమావేశాల్లో పాల్గొని, 15 పరిశోధన సంస్థలను సందర్శించి, 200 సదస్సులు, స్నాతకోత్సవాల్లో ప్రసంగించి, 29 రాష్ట్రాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి మరొకరు లేరని కొనియాడారు. ఇంకా స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవెగౌడ కూడా తమ ప్రసంగాలలో వెంకయ్యను ప్రశంసించారు.

చివరిగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంటరీ వ్యవస్థల పట్ల ప్రజలకు గౌరవం పెరగాలంటే ప్రజాప్రతినిధులకు ప్రవర్తనా నియమావళి ఉండాలని అన్నారు. శాసన సభ్యులు పార్టీ మారేముందు తమ పదవులకు రాజీనామా చేయాలని, ఈ కేసులను స్పీకర్లు మూడు నెలల్లోనే తేల్చేయాలని సూచించారు.

More Telugu News