kcr: కేసీఆర్ ప్రగతి నివేదన సభ తుస్సుమంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా

  • డబుల్ బెడ్ రూములు, ముస్లిం రిజర్వేషన్ల అంశమే లేదు
  • కరెంట్ విషయంలో పాత అబద్ధాలనే మళ్లీ చెప్పారు
  • రాష్ట్రానికి కేసీఆర్ ఏమీ చేయలేరనే విషయం ఈరోజు అర్థమయింది

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ తుస్సుమందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇది ప్రగతి నివేదన సభ కాదని, ప్రగతి ఆవేదన సభ అని విమర్శించారు. సభ కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేశారని... ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఇదంతా దోచుకున్న సొమ్మే అని ఆరోపించారు. సభ కోసం బస్సులను బలవంతంగా తరలించారని చెప్పారు. కేసీఆర్ ప్రసంగంలో డబుల్ బెడ్ రూములు, ముస్లింలకు రిజర్వేషన్ల అంశమే లేదని అన్నారు. కరెంట్ విషయంలో పాత అబద్ధాలనే మళ్లీ చెప్పారని తెలిపారు.

కేసీఆర్ ప్రసంగం మొత్తం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కావడానికి గత కాంగ్రెస్ పాలనే కారణమని చెప్పారు. కేసీఆర్ పాలనలో అవినీతి, అప్పుల్లో తెలంగాణ నెంబర్ వన్ అయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారని... అసలు రాష్ట్రంలో కోటి ఎకరాల ఆయకట్టే లేదని అన్నారు. రాష్ట్రం మొత్తాన్ని ఆల్కహాల్ లో ముంచెత్తుతున్నారని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రానికి ఏమీ చేయలేడనే విషయం ఈరోజుతో అర్థమయిందని చెప్పారు. 'కేసీఆర్ హఠావ్.. తెలంగాణ బచావ్' నినాదంతో ఇకపై ముందుకు వెళతామని తెలిపారు.

More Telugu News