yogi: కోతులు ఇబ్బంది పెడుతున్నాయా.. హనుమాన్ చాలీసా చదవండి!: ప్రజలకు యూపీ ముఖ్యమంత్రి సలహా

  • అలాచేస్తే కోతులు దాడి చేయవు
  • రోజూ హనుమంతుడిని పూజించండి
  • సీఎం వ్యాఖ్యలపై నెటిజన్ల జోకులు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి విమర్శల జడివానలో చిక్కుకున్నారు. యూపీలోని బృందావనంలో పర్యటిస్తున్న ఆయన కోతుల బెడద తగ్గాలంటే హనుమాన్ చాలీసా పఠించాలని ప్రజలకు సూచించారు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడంతో పాటుగా ఆంజనేయ స్వామిని పూజిస్తే కోతులు కరవవని, ఎటువంటి హానీ చేయవని వ్యాఖ్యానించారు. దీంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చుతున్నారు.

‘నన్ను నమ్మండి మీరు హనుమాన్ చాలీసా చదువుతూ, ఆంజనేయ స్వామిని పూజ చేయడాన్ని చూశాక కోతులు మీపై ఎప్పుడూ దాడిచేయవు, కరవవు. నేను గోరఖ్ నాథ్ ఆలయంలో పనిచేసేటప్పుడు రోజూ ఓ కోతి వచ్చి నా తొడపై కూర్చునేది. నేను దానికి ఓ అరటిపండును ఇచ్చేవాడిని. పండును తీసుకుని కోతి వెళ్లిపోయేది. ఓరోజు ఆలయంలో పనిచేస్తున్న మరో వ్యక్తి ఆ కోతిని అదిలించాడు. దీంతో అతనిపై ఆ మూగజీవి దాడిచేసింది. జంతువులను బెదిరిస్తేనే అవి మనపై దాడిచేస్తాయి’ అని ఆదిత్యనాథ్ సెలవిచ్చారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘యోగి చెప్పిన హనుమాన్ చాలీసా విధానం పనిచేయడం లేదు. నేను 2017, మార్చి నుంచి రోజూ హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నాను. కానీ ఇంకా యోగీనే ముఖ్యమంత్రిగా ఉన్నారు’ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇంకొకరు ‘మరి మీలాంటి వాళ్లను దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి యోగీజీ?’ అని ప్రశ్నించారు. ఇంకొందరు అయితే ఏకంగా యోగి, కోతి ఫొటోలను మార్ఫింగ్ చేసి పెట్టారు.

More Telugu News