FLORIDA: పోలీస్ అధికారిని తరిమిన పంది పిల్ల.. వైరల్ గా మారుతున్న సెల్ఫీ వీడియో!

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
  • పోలీస్ అధికారి వెంటపడ్డ పంది పిల్ల
  • నెటిజన్ల ప్రశంసల వర్షం

పోలీసులను చూస్తే దొంగలు, రౌడీలు పారిపోతారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఓ చిన్న పందిపిల్ల వెంటపడటంతో ఏకంగా పోలీస్ అధికారి పరుగెత్తుకుంటూ జనాలు ఉండేచోటుకు వెళ్లాడు. అయితే ఆయన పరుగెత్తింది భయంతో మాత్రం కాదు. ఈ పంది పిల్లను ఓనర్ దగ్గరకు చేర్చడానికే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేప్ కోరల్ పోలీస్ శాఖ ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కేప్ కోరల్ లో విల్లీ అనే ఓ పెంపుడు పంది పిల్ల తిరుగుతున్నట్లు ఆగస్టు 26న పోలీసులకు సమాచారం అందింది. దీంతో రే స్కిల్కే అనే పోలీస్ అధికారి అక్కడకు చేరుకున్నాడు. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో రేనే తన ఓనర్ గా భావించిన పందిపిల్ల అధికారి దగ్గరకు వచ్చింది. దీంతో సమీపంలో కొంతమంది స్థానికులు ఉండటాన్ని గమనించిన రే.. అటువైపు పరిగెత్తాడు. అతనివెంట ఈ చిన్న జంతువు కూడా పరిగెత్తింది. ఈ మొత్తం తతంగాన్ని రే సెల్ఫీ వీడియో తీశాడు.

రోడ్డు పక్కన ఓ జంట ఇతడిని చూసి నవ్వడం ప్రారంభించింది. దీంతో రే స్పందిస్తూ.. ‘పందిని పందిపిల్ల తరమడం ఎప్పుడూ చూడలేదా?’ అని తనపై తానే జోక్ వేసుకున్నాడు. అక్కడ చిన్నారులు ఉండటంతో ‘ఈ జంతువు ఎవరిదో మీకు తెలుసా?’ అని రే వారిని అడిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేప్ కోరల్ పోలీస్ శాఖ ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది. దీంతో రే స్కిల్కేపై వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆఖరికి విల్లీ తన ఓనర్ ని చేరుకుంది.

More Telugu News