YSRCP: సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం... వైఎస్ ను దూరం చేసిన సెప్టెంబర్ 2!

  • చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వైఎస్
  • నల్లమల అడవుల్లో కుప్పకూలిన చాపర్
  • ప్రమాదంలో మరణించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్

సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం... అంటే 2009లో సెప్టెంబర్ 2న... చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, నల్లమల ప్రాంతంలో అసువులు బాసిన రోజు. ఆయన దూరమై, నేటికి తొమ్మిది సంవత్సరాలు కాగా, కాంగ్రెస్ శ్రేణులతో పాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డిగా జయమ్మ, రాజారెడ్డి దంపతులకు 1949, జూలై 8న జన్మించిన ఆయన, రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. 1978లో తొలిసారిగా పులివెందుల నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో కాలుమోపిన ఆయన, ఆపై ఎన్నడూ పరాజయాన్ని చవిచూడలేదు. 6 సార్లు పులివెందుల నుంచి అసెంబ్లీకి, నాలుగు సార్లు కడప నుంచి పార్లమెంట్ కు ఎన్నికైన వైఎస్ఆర్, 1980 - 83 మధ్య తొలిసారిగా మంత్రి పదవిని నిర్వహించారు.

 రాష్ట్ర అసెంబ్లీ విపక్షనేతగా, రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2003లో మండు వేసవిలో ఆయన చేపట్టిన పాదయాత్ర 1,467 కిలోమీటర్లు సాగగా, ఆ మరుసటి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. వైఎస్ తొలిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తానిచ్చిన ఉచిత విద్యుత్, పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంకు ప్రాధాన్యం ఇవ్వడం తదితర అభివృద్ధి పనులతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తట్టుకుని, తిరిగి 2009లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగారు. ఆపై కొన్ని రోజుల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో దూరమయ్యారు.

ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్, కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లకాలువ, రుద్రకోడూరు గ్రామాల మధ్య దట్టమైన అడవుల్లో కుప్పకూలింది. తమ అభిమాన నేత మరణాన్ని తట్టుకోలేని పలువురు గుండెపోటుకు గురై మరణించగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

More Telugu News