pragati nivedana sabha: గులాబీమయమైన హైదరాబాద్.. ప్రగతి నివేదన సభకు పోటెత్తుతున్న జనం!

  • సభకు సిద్ధమైన కొంగర్ కలాన్
  • రేపు భేటీ కానున్న తెలంగాణ కేబినెట్
  • ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేయొచ్చని ఊహాగానాలు

నాలుగున్నరేళ్ల కాలంలో తాము అందించిన పాలన, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. రేపు రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ లో నిర్వహించనున్న ఈ వేడుక కోసం 31 జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పార్టీ జెండాలు, గులాబీ రంగులతో అలంకరించిన ట్రాక్టర్లు, లారీల్లో ప్రజలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.


కాగా ఆదివారం ప్రగతి నివేదన సభకు కొన్ని గంటల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దుచేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు సమర్పించే అవకాశముందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ప్రకటించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


ఇక రేపటి ప్రగతి నివేదన సభ నేపథ్యంలో హైదరాబాద్ లోని రోడ్లన్నీ గులాబీమయం అయిపోయాయి. హైదరాబాద్ తో పాటు కొంగర్ కలాన్ సభా ప్రాంగణాన్ని, ఔటర్ రింగ్ రోడ్డును టీఆర్ఎస్ జెండాలు, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ ముఖ్యనేతల భారీ ప్లెక్సీలు, భారీ కటౌట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సభ కోసం 7,000 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు.


ఈ సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగర్ కలాన్ కు చేరుకునేందుకు మొత్తం 19 మార్గాలను ఎంపిక చేసిన అధికారులు.. వాహనాల కోసం 14 పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే సాయం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. సభ నేపథ్యంలో శని, ఆదివారాల్లో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని నగర ప్రజలకు అధికారులు సూచించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.


ప్రజలు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో వారి వాహనాలకు టోల్ ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామని టీఆర్ఎస్ పార్టీ తెలిపిందన్నారు. ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్లలో వచ్చేవారు ఒకరోజు ముందుగానే చేరుకోవాలని సూచించారు. కొంగర్ కలాన్ లో జరిగే ఈ సభకు 25 లక్షల మందిని సమీకరించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభకు వచ్చేవారికి అనారోగ్యం తలెత్తితే.. చికిత్స కోసం 200 మెడికల్ క్యాంపులు, వైద్య సిబ్బందితో పాటు 30 అంబులెన్సులను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

More Telugu News