Pawan Kalyan: త్రినాథ్ బలవన్మరణం కలచివేసింది: పవన్ కల్యాణ్

  • బలి దానాలు వద్దు... హోదా దక్కే వరకూ పోరాడదాం
  • హోదా సాధనలో పాలకుల నిర్లక్ష్య ధోరణి తగదు
  • ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం జిల్లా కాగిత గ్రామానికి చెందిన యువకుడు దొడ్డి త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. త్రినాథ్ బలవన్మరణం సంఘటన గురించి తెలియగానే మనసు వికలమైందని, హృదయాన్ని కలచి వేసిందని అన్నారు. అతన్ని కన్నవారికి ఎంతటి శోకాన్ని మిగులుస్తుందో అర్థం చేసుకోగలనని, ప్రాణత్యాగం చేసిన త్రినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని,. కడుపు కోతను దిగమింగుకొనే ధైర్యాన్ని కన్నవారికి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.

‘రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాన మంత్రి పార్లమెంట్ కు ఇచ్చిన హామీని సాధించుకోవడంలో పాలకులు విఫలమయ్యారు. హోదా సాధనలో పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో... ముఖ్యంగా యువతలో అసహనాన్ని తీసుకువస్తుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి హోదా, విభజన హామీల అమలును పట్టించుకోకపోవడం వల్లే ఇంతకు ముందు తిరుపతిలో ముని కోటి, ఇప్పుడు విశాఖ జిల్లాలో త్రినాథ్ ప్రాణ త్యాగాలు చేశారు.

యువకుల ప్రాణ త్యాగాలతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఎన్ని మాటలు మార్చినా, సాధనలో విఫలమైనా మనందరం బలంగా ప్రజల ఆకాంక్షను వినిపిద్దాం. దయచేసి ఎవరూ బలి దానాలకు పాల్పడవద్దు. ఆంధ్రప్రదేశ్ కు హోదా దక్కే వరకూ పోరాడదాం’ అని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

More Telugu News