Andhra Pradesh: హైకోర్టు భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకు సిద్ధం: సుప్రీంకోర్టులో తెలంగాణ

  • హైకోర్టు విభజన జరగాల్సిందేనన్న అటార్నీ జనరల్
  • హైకోర్టులో ఉన్న ఖాళీ హాళ్లను వాడుకోవచ్చన్న తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది
  • హైకోర్టు, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా, హైకోర్టు విభజన జరగాల్సిందేనంటూ కేంద్ర న్యాయశాఖ తరపున వాదించిన అటార్నీ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. 2015 మే 1న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని విన్నవించారు.

తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి వాదిస్తూ... హైకోర్టులో ప్రస్తుతం 24 హాళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఏపీ సర్కారు ఈ హాళ్లను వాడుకోవచ్చని... అవసరమైతే హైకోర్టు భవనం మొత్తాన్ని ఖాళీ చేసి, ఏపీకి అప్పగిస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చట్టసభలు, అధికారుల విభజన జరిగిందని.. న్యాయ వ్యవస్థ మాత్రం విభజన కాలేదని చెప్పారు.

వాదలను విన్న సుప్రీంకోర్టు ఉమ్మడి హైకోర్టు, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా అభిప్రాయాలను తెలపాలని నోటీసుల్లో ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల వరకు వాయిదా వేసింది.     

More Telugu News