stalin: నన్ను పార్టీలో చేర్చుకుంటే... స్టాలిన్ ని నాయకుడిగా అంగీకరిస్తా!: అళగిరి

  •  ఓ మెట్టు దిగిన అళగిరి 
  • స్టాలిన్ ను అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను
  • మీడియాతో మాట్లాడిన అళగిరి

తనను పార్టీలో చేర్చుకోకపోతే స్టాలిన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన ఆయన సోదరుడు అళగిరి ఇప్పుడు కాస్త మెత్తపడ్డారు. చెన్నైలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను పార్టీలో చేర్చుకుంటే కనుక డీఎంకే అధినేతగా స్టాలిన్ ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ‘నేను పార్టీలో చేరాలనుకుంటే, అప్పుడు స్టాలిన్ ను నాయకుడిగా అంగీకరించకతప్పదు' అంటూ అళగిరి వ్యాఖ్యానించడం గమనార్హం.

కాగా, తనకు పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి బలమైన మద్దతు ఉందని, తనను పార్టీలోకి తీసుకోవాలన్నది అళగిరి వాదన. వచ్చే నెల 5న చెన్నైలో ఓ భారీ ర్యాలీ నిర్వహించాలని, ఆ తర్వాత తన భవిష్యత్ ప్రణాళిక వెల్లడిస్తానని ఆయన చెప్పారు. అయితే, డీఎంకే నేతల్లో చాలా మంది ఆయనకు ముఖం చాటేయడం, ‘నాకు సోదరుడే లేడు’ అని స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అళగిరి  ఓ మెట్టు వెనక్కి తగ్గారని చెప్పడానికి ఆయన తాజా వ్యాఖ్యలే నిదర్శనమని తమిళ రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News