Madhya Pradesh: మంత్రిగారి కోసం ప్లాట్ ఫామ్ పైకొచ్చిన కారు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

  • మధ్యప్రదేశ్ క్రీడా మంత్రి నిర్వాకం
  • కారును ప్లాట్ ఫామ్ పైకి తీసుకెళ్లిన అధికారులు
  • సహకరించిన రైల్వే పోలీసులు

వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ కోరినా ఆయన పార్టీకి చెందిన నేతలు కొందరు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఓ మంత్రి రైలులో వస్తున్నారని అధికారులు స్వయంగా కారును రైల్వే ప్లాట్ ఫామ్ పైకి తీసుకెళ్లారు. పోలీసులు దగ్గరుండి ఈ తతంగాన్ని పర్యవేక్షించారు. గ్వాలియర్ పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ క్రీడా మంత్రి యశోధర రాజే సింధియా బుధవారం గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో దిగారు. దీంతో మంత్రిగారి కోసం అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి కారును ఏకంగా ప్లాట్ ఫామ్ పైకి తీసుకెళ్లారు. వీరిని అడ్డుకోవాల్సిన రైల్వే పోలీసులు దగ్గరుండి మరీ మంత్రిని కారులో ఎక్కించారు. చివరికి ఆమె నవ్వులు చిందిస్తూ కారెక్కి వెళ్లిపోయారు. మంత్రితో పాటు ఆమె అనుచరులు పెద్దఎత్తున ప్లాట్ ఫామ్ పై గుమిగూడటంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మంత్రిగారి కారు ఆపిన చోటే గేటుకు ‘రైల్వే ప్లాట్ ఫామ్ పైకి వాహనాలు వస్తే రూ.500 జరిమానా విధిస్తాం’ అని రాసుంది!

ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. చట్టాలను గౌరవించాలని చెప్పాల్సిన మంత్రే ఏకంగా వాటిని ఉల్లంఘిస్తున్నారని ఎద్దేవా చేసింది. బీజేపీ ఆలోచన విధానం ఏంటో ఈ ఘటనతోనే తేటతెల్లమవుతోందని విమర్శించింది. కాగా మంత్రి వ్యవహారశైలిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి వీఐపీ సంస్కృతి మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.


More Telugu News