ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల వివరాలు అడిగినా ఇవ్వరా?: కేంద్రంపై సుప్రీంకోర్టు గుస్సా

30-08-2018 Thu 14:48
  • వివరాలు ఇవ్వకపోవడంపై గుస్సా
  • ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై ప్రశ్నలు
  • విచారణ వచ్చే నెల 5కు వాయిదా
క్రిమినల్ కేసులు ఉన్న పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేల వివరాలను సమర్పించాలని ఆదేశించినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులను పరిష్కరించడానికి అదనపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారా? లేదా? అన్న విషయమై స్పష్టత ఇవ్వాలంది. ఈ విషయమై సెప్టెంబర్ 5కల్లా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది.

రాజకీయ నేతలపై దాఖలైన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గతేడాది సెప్టెంబర్ లో రాజకీయ నేతలపై కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు కేంద్రానికి చెప్పింది. వీటి ఏర్పాటుకు, మౌలిక వసతుల కల్పనకు పార్లమెంటులో చట్టం చేయాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.